కాస్త ఊరట!

Corona Cases Down in Hyderabad - Sakshi

కొన్ని ప్రాంతాల్లో నమోదు కాని కొత్త కేసులు  

అక్కడక్కడా కంటైన్మెంట్‌ క్లస్టర్ల ఎత్తివేత

ఇంకొన్ని చోట్ల కోవిడ్‌ పాజిటివ్‌లు

రెడ్‌జోన్లుగా ప్రకటించిన అధికారులు  

మిగతా చోట్ల లాక్‌డౌన్‌ యథాతథం  

ఓల్డ్‌ బోయిన్‌పల్లి: కరోనా పాజిటివ్‌ కేసులు, అనుమానితుల సంఖ్య తగ్గడంతో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ క్లస్టర్లను ఎత్తివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. హస్మత్‌పేట ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌ నుంచి తొలగించారు. శుక్రవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ యాదవ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్లస్టర్‌లో పర్యటించారు. పోలీసుల పికెట్లు, చెక్‌పోస్టులు, బారికేడ్లను ఎమ్మెల్యే స్వయంగా తొలగించారు. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.  

శేరిలింగంపల్లి పరిధిలో..
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో కంటైన్మెంట్‌ జోన్లు ఇక రెండే మిగిలాయి. తాజాగా ఏడు జోన్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో తొమ్మిది కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తి వేసినట్లయింది. చందానగర్‌ సర్కిల్‌– 21 పరిధిలోని ఆదిత్యనగర్, ఇజ్జత్‌నగర్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా కొనసాగనున్నాయి. తాజాగా చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని సాయినగర్, మదీనాగూడ, అయ్యప్ప సొసైటీ, అంబేడ్కర్‌ నగర్, సితార హోటల్, సియేస్టా హోటళ్లను కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి ఎత్తి వేశారు. 

కుత్బుల్లాపూర్‌ పరిధిలో మూడు..
కుతుల్లాపూర్‌: సర్కిల్‌లోని మూడు కంటైన్మెంట్‌ జోన్లను అధికారులు ఎత్తివేశారు. నియోజకవర్గంలో గత 14 రోజులుగా ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడంతో అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్‌నగర్‌ కంటైన్మెంట్‌ జోన్లను  ఎత్తివేసినట్లు ఎమ్మెల్యే వివేకానంద్‌ తెలిపారు. 

అంబర్‌పేటలో ఓ కంటైన్మెంట్‌ ఎత్తివేత..
అంబర్‌పేట: నల్లకుంట పరిధిలోని హ్యాపీహోం వద్ద ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌ను శుక్రవారం అధికారులు తొలగించారు. కరోనా బాధితుడికి నెగెటివ్‌ రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు కంటైన్మెంట్‌ జోన్లు మాత్రమే మిగిలాయి. 

ఇందిరమ్మ కాలనీలోఆరు నెలల చిన్నారికి పాజిటివ్‌
నిజాంపేట్‌: నిజాంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌–2లో 6 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు.  పాప కుటుంబ సభ్యులందరినీ ఆస్పత్రికి తరలించారు. కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.  

జయనగర్‌లో రిటైర్డ్‌ టీచర్‌కు..
బన్సీలాల్‌పేట్‌: బోయిగూడ జయనగర్‌ ప్రాంతంలోని ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కట్టడి చేశారు. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.  

హెచ్‌బీకాలనీలో టైలర్‌కు..
కుషాయిగూడ: మీర్‌పేట–హెచ్‌బీకాలనీ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌ కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు అతని కుటుంబ సభ్యులు మరో ఏడుగురిని పరీక్షల నిమిత్తం కంటైన్మెంట్‌కు తరలించారు. అతను నివాసం ఉంటున్న వేంకటేశ్వరనగర్‌ కాలనీలో కొంత భాగాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top