సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌   

coombing In Border Areas - Sakshi

ఎన్‌కౌంటర్, హత్యలతో  అప్రమత్తమైన పోలీసులు

గోదావరి పరివాహక ప్రాంతంలో నిఘా

కాటారం(మంథని) వరంగల్‌ : రాష్ట్ర సరిహద్దులోని గోదావరితీర అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్, మావోయిస్టుల హత్యలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీరప్రాంతమైన మహదేవపూర్‌ నుంచి ఏటూరునాగారం వరకు కూంబింగ్‌ చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా కుకడాంజోర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుమీయాబెడా అడవుల్లో సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా కామాండర్‌తోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి దాటి తెలంగాణలో తలదాచుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం మేరకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది.

కాంకేర్‌ జిల్లా బందె పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తాడంవెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను ఇన్ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. చత్తీస్‌గఢ్‌ – మహారాష్ట్ర మధ్య ప్రవహిస్తున్న ఇంద్రావతి నది దాటి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తాడగూడ రోడ్డు వద్ద సోనువదా, సోమ్‌జీవదాను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కలిసే మహదేవపూర్‌ అడవుల్లోకి మావోయిస్టులు చొరబడి తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో జిల్లా ఎస్పీ భాస్కరన్, మహదేవపూర్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. డీఎస్పీ కేఆర్‌కే.ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

సరిహద్దుల్లోని గడ్చిరోలి, బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల పోలీసులతో ఎప్పటికప్పుడు మావోయిస్టుల సంచారంపై సమాచారాన్ని తెలుసుకుంటూ గాలింపు చర్యలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్‌ పనుల వద్ద మహదేవపూర్‌ సీఐ రంజిత్‌కుమార్, కాటారం సీఐ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అటవీ గ్రామాల్లో పోలీసుల గాలింపు చేపట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అడవిబిడ్డలు ఆందోళన చెందుతున్నారు.

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

ఎన్‌హెచ్‌–163 పై పేలుడు పదార్థాలున్నట్లు అనుమానం

ఏటూరునాగారం(ములుగు) : ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం ప్రధాన రహదారులు, హైదరాబాద్‌ టు ఛత్తీస్‌గఢ్‌ 163–జాతీయ రహదారికి ఇరువైపులా బాంబ్‌ స్క్వాడ్‌ బృందం సోమవారం తనిఖీలు చేపట్టింది. చత్తీస్‌గఢ్‌ వెళ్లే జాతీయ రహదారి ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 13 కిలోమీటర్ల మేర మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టారనే అనుమానంతో ట్రాక్టర్‌ బ్లేడ్‌ బండి ద్వారా ఫ్లవ్‌ వేసి పరిశీలించారు. తుపాకులగూడెం వెళ్లే రోడ్లను సైతం పోలీసులు పరిశీలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల్లో సీఐ సత్యనారాయణ, ఎస్సై సాంబమూర్తి, బాంబ్‌ స్క్వాడ్‌ బృందం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top