తన్నుకున్న కాంట్రాక్టర్లు..

contractors fight

 ధాన్యం తరలింపునకు టెండర్లు

దాఖలు చేయకుండా అడ్డుకున్న ముఠా

జగిత్యాల క్రైం: జగిత్యాలలో కాంట్రాక్టర్లు తన్నుకున్నారు. సిండికేట్‌ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో ఎవరికి వారు టెండర్లు వేసేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్‌మిల్లులకు తరలించేందుకు లారీ యజమానుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గడువు విధించడంతో కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల తదితర ప్రాంతాలకు చెందిన 18 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, శనివారం ఉదయం 11 గంటల నుంచే కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయ్యేందుకు మంతనాలు జరిపారు. మధ్యాహ్నం 1.30 వరకు చర్చలు జరిగినా.. అవి విఫలం కావడంతో ఎవరికి వారు టెండర్లు దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు.

ఈ క్రమంలో మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ బృందం టెండర్లు వేసేందుకు వెళ్తున్న కాంట్రాక్టర్లను అడ్డుకొని.. బయటకు నెట్టివేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంట్రాక్టర్లు తమ అనుచరులతో కార్యాలయంలోనికి చొరబడగా.. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇతర సామగ్రి కిందపడి ధ్వంసమయ్యాయి. టెండర్‌ బాక్స్‌ సైతం కిందపడి దరఖాస్తులు చిందరవందరగా పడ్డాయి. భయంతో ఉద్యోగులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. 2 గంటల వరకు ఏడు టెండర్లు మాత్రమే దాఖలు కాగా, దాడుల భయంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయలేకపోయారు. పౌరసరఫరాల శాఖ డీఎం జితేంద్రప్రసాద్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృపాకర్‌ వచ్చి ఓ ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top