ఒకసారి ఓడిపోతే..  బతికే ధైర్యం వస్తుంది

Constable Successful Life Story Rangareddy - Sakshi

 సాక్షి, దోమ : నా పేరు కె.రాఘవేందర్‌. మాది దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వరకు బాగానే చదివాను. ఫస్ట్‌ ఇయర్‌ ఫస్ట్‌క్లాస్‌ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్‌ ఇయర్‌లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్‌నగర్‌లో డీఈడీ కోచింగ్‌కు కూడా వెళ్లాను. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను.

అయితే, ‘ఫెయిల్‌’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్‌కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్‌ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్‌ అని ఉంది. ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్‌ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్‌ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను. వెంటనే  మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చింది.

ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్‌ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్‌ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్‌లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్‌ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్‌లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది. ఇంటర్‌ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్‌ ఫెయిల్‌ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top