త్వరలో కానిస్టేబుల్‌ ఫలితాలు

Constable results will be soon - Sakshi

నెలాఖరులోగా విడుదలకు సన్నాహాలు

చకచకా శిక్షణకు ఏర్పాట్లు 

శిక్షణకోసం వీలైతే పొరుగు రాష్ట్రాలకు అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న కానిస్టేబుల్‌ పరీక్ష తుది ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎస్సై అభ్యర్థుల ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈ నెలాఖరుకు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తీపికబురు అందించనుంది. ఇప్పటికే 1,272 మంది ఎస్సై అభ్యర్థుల తుది ఫలితాలు విడుదల చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసు అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)తోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లో శిక్షణకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 

సిలబస్, సిబ్బంది అంతా సిద్ధం.. 
కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికోసం ఇప్పటికే సిలబస్‌ సిద్ధంగా ఉంది. పెద్దగా మార్పులు ఏమీ లేనప్పటికీ.. ఈసారి యాప్స్‌ వినియోగం, టెక్నాలజీ, సైబర్‌ నేరాలు, ఆధారాల సేకరణకు ఆధునిక సమాచారం జోడించి స్వల్పమార్పులు చేసినట్లు సమాచారం. ప్రాక్టికల్స్‌కు కూడా పెద్దపీట వేశారు. ఎస్సై బ్యాచ్‌ 1,272 మంది, 16,925 మంది కానిస్టేబుళ్లకు ఒకేసారి తరగతులు ప్రారంభంకానున్నాయి. వీరికి తరగతులు బోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,800 మంది పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

వీరికి తోడుగా 35 మంది విశ్రాంత పోలీసులు, మాజీ సైనికులు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తరగతులు మొదలయ్యేసరికి మరో 40 మంది వరకు విశ్రాంత పోలీసు, సైనిక సిబ్బంది వచ్చి చేరతారని అధికారులు తెలిపారు. దాదాపు 18 వేల మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేందుకు ఈ సిబ్బంది, ఇక్కడున్న సదుపాయాలు సరిపోతాయా? అన్న సందేహం కూడా అధికారుల్లో ఉంది. దీంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. శిక్షణలో భాగంగా కొందరిని అక్కడికి పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top