
భువనగిరి అర్బన్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు కొనపూరి శంకరయ్యను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం డీసీపీ పాలకుర్తి యాదగిరి మీడియాకు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంకు చెందిన కొనపూరి శంకరయ్యను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు టీఆర్‌ఎస్ నేత కోనపురి రాములు వర్గానికి చెందిన కొమురెల్లి ప్రదీప్‌రెడ్డి పథకం పన్నాడు. ప్రదీప్‌రెడ్డి గతంలో శంకరయ్యను హత్య చేసేందుకు విఫలయత్నం చేసి జైలుకు వెళ్లాడు.
విడుదలైన అనంతరం శంకరయ్యను హత్య చేయాలని కనకాల లింగస్వామి, దాసరి లవలేష్, దేవరపల్లి భూపాల్‌రెడ్డి, రాపోలు నాగభూషణం, పొగిళ్ల వెంకన్న, జోగు కిరణ్, కర్నాటి రమేశ్‌తో జతకట్టాడు. వీరందరూ స్కార్పియో వాహనం, బైక్‌పై చౌటుప్పల్ నుంచి వలిగొండకు వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గొల్నేపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి ఐదు గొడ్డళ్లు, రెండు నాన్‌చాక్‌లు, బటన్ చాకు, డమ్మీ పిస్తోల్, ఏడు సెల్‌ఫోన్‌లు, 9 మాస్క్‌లు, స్కార్పియో వాహనం, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.