
న్యూఢిల్లీ: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు ఢిల్లీతోపాటు హర్యానా అంతటా 25 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ద్వారక డీసీపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 380 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈ ఏడాది ఈ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా తెలుస్తోంది.
25 గ్యాంగస్టర్ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్‌లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్‌ల క్రిమినల్ నెట్‌వర్క్‌లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు,పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 8 పిస్టల్స్, 29 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, మూడు మ్యాగజైన్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్, ఆడి కారు, 14 హై-ఎండ్ లగ్జరీ గడియారాలు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, నగదు లెక్కింపు యంత్రాలు, వాకీ-టాకీ సెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీసులు 26 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులందరూ నందు, విక్కీ టక్కర్ ముఠాతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు.
అర్టెస్టయిన నిందితులు
పవన్ అలియాస్ ప్రిన్స్ (18): రాజ్‌మందిర్ స్టోర్, చావ్లా కాల్పుల కేసుల్లో పాల్గొన్న నందు ముఠాకు చెందిన షూటర్.
హిమాన్షు అలియాస్ మచ్చి (24): విక్కీ టక్కర్ గ్యాంగ్ సభ్యుడు. ఏడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు.
ప్రశాంత్: నందు గ్యాంగ్ షూటర్. ఇతనిపై 11 కేసులు నమోదయ్యాయి.
రాహుల్ దివాకర్ అలియాస్ మన్‌ప్రీత్ (25): విక్కీ టక్కర్ గ్యాంగ్‌కు చెందినవాడు. 20 ఎఫ్‌ఐఆర్‌లలో ఇతని పేరు ఉంది.
అంకిత్ ధింగ్రా అలియాస్ నోని (34): నందు గ్యాంగ్‌తో సంబంధం ఉన్నాడు. ఇతనిపై 10 కేసులున్నాయి.
ప్రవీణ్ అలియాస్ డాక్టర్: ఇతని పేరు మీద 25కు పైగా క్రిమినల్ కేసులున్నాయి.