నా తండ్రి హత్యపై సమగ్ర విచారణ జరపాలి

A Comprehensive Inquiry Into My Father's Murder  - Sakshi

జనగామ అర్బన్‌: ప్రెస్టన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ దైదా క్రిస్టోఫర్‌ హత్యకు సంబంధించి పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలన్నీ అవాస్తవమని, క్రిస్టోఫర్‌ కూతురు, న్యాయవాది దైదా ప్రియాంక ప్రియదర్శని అన్నారు. ప్రెస్టన్‌ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులు ఉపేష్, ఉప్పలయ్య ప్రెస్టన్‌ భూములను పెద్దమొత్తంలో తమకు విక్రయించాలని ఒత్తిడి తెచ్చినా తన తండ్రి ఒప్పకోకపోవడంతో కక్ష పెంచుకున్నారని తెలిపారు.

ఈ విషయంలో 17 నెలల క్రితం దాడికి పాల్పడి త్రీవంగా గాయపరిచారని అన్నారు.   బాణపురానికి సంబంధించిన ఇంటి విషయంలో ఎలాంటి గొడవలు లేవని, అది మా వ్యక్తిగత ఆస్తి అని తెలిపారు. ఇక తన తండ్రిపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపేష్‌ను అరెస్టు చేయలేదన్నారు.

పోలీసులు చెప్పినట్లు ఉపేష్‌ తన తండ్రికి రూ.6 లక్షలు ఇచ్చి ఉంటే సదరు విషయాన్ని ఉపేష్‌ ఎప్పుడు పోలీసుల దృష్టికి గాని, న్యాయపరంగా కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దాడి జరిగిన క్రమంలో సైతం బాణపురానికి సంబంధించిన ఆస్తిగొడవ అని ఫిర్యాదు ఇవ్వలేదని, ఇప్పటికైనా వాస్తవాలను వెలికితీసే విధంగా సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. కేసును పది రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top