బెదిరిస్తే చర్యలు తప్పవు.. | Compliment to the son of the Constable | Sakshi
Sakshi News home page

బెదిరిస్తే చర్యలు తప్పవు..

Jun 10 2014 3:47 AM | Updated on Aug 21 2018 9:20 PM

బెదిరిస్తే చర్యలు తప్పవు.. - Sakshi

బెదిరిస్తే చర్యలు తప్పవు..

బెదిరింపులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.

 ప్రజాదివస్‌లో ఎస్‌పీ ఏవీ రంగనాథ్

ఖమ్మం, క్రైం : బెదిరింపులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్‌పీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి.   
 
తనకు కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగిందని, రెండు నెలలు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని, ఈ విషమంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా మార్పురాలేదని, దీంతో మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని, కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అయినా అతనిలో మార్పు రాలేదని ఖమ్మంనగరంలోని ముస్తఫానగర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అందుకు స్పందించిన ఎస్‌పీ కేసు ఫైల్‌ను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి లేదని, సీఐపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశామని అన్నారు.  
 
తాను కష్టపడి సంపాదించిన 26 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు చెరో 12 ఎకరాలు పంచి ఇచ్చానని, వృద్ధాప్యంలో తనకు జీవనోపాధి కోసం రెండు ఎకరాలు ఉంచుకున్నాని, ప్రస్తుతం తన వయసు 90 సంవత్సరాలని, భూమి అమ్ముకునేందుకు కుమారుడు అడ్డుపడి బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కొణిజర్లకు చెందిన కూచుపూడి వెంకయ్య ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన ఎస్‌పీ.. బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని, వారిద్దరిని పిలిచి విచారించి తగిన సమాచారం ఇవ్వాలని వైరా సీఐను ఆదేశించారు.
 
తాను ఉయ్యూరు నుంచి ఖమ్మం వస్తూ వైరాలో తోపుడుబండి వద్ద టిఫిన్ చేద్దామని ఆగగా ద్విచక్ర వాహనంపై మఫ్టీలో వచ్చిన ఎస్‌ఐ అభ్యం్తతరకరంగా మాట్లాడుతూ సర్వీస్ రివాల్వర్‌తో తలపై దాడి చేశాడని, తనకు న్యాయం చేయాలని ఖమ్మానికి చెందిన నవీన్‌కుమార్ ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన  ఎస్‌పీ ... వైరా ఎస్‌ఐను ఖమ్మం ఎస్‌పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని వైరా డీఎస్పీని ఆదేశించారు. అలాగే కానిస్టేబుల్‌ను ఏజెన్సీ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని తెలిపారు.  
 
కానిస్టేబుల్ కుమారుడికి అభినందన...
త్రివేణి పాఠశాలలో పదో తరగతి చదివి 10కి 10 జీపీఏ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లయ్య కుమారుడు బొడ్డు మహేష్‌ను, అలాగే 10కి 10 జీపీఏ సాధించిన ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు కుమారుడు గుంటుపల్లి మనోజ్‌కుమార్‌ను ఎస్‌పీ ఏవీ రంగనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సత్యకుమార్, ఆర్ ఎస్‌ఐ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement