
సాయంత్రం వేళల్లోనే ఒక్కసారిగా భారీ వర్షాలు
ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కీలకం
అందుకే చెరువులు, కుంటలు, నాలాలపై దృష్టి
ఏ ప్రాంతంలోనూ నివాసాల జోలికి వెళ్లడం లేదు
కబ్జా స్థలాల్లో కృత్రిమ నివాసాలు సృష్టిస్తున్నారు
రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాలకు విముక్తి
వెల్లడించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ కారణంగా నగరాల్లో ఏర్పడుతున్న ‘హీట్ ఐలాండ్’ కారణంగానే క్లౌడ్ బరస్ట్, మినీ క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతున్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
దీనికి కండెక్టివ్ కరెంట్ తోడు కావడంతో సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుందని వివరించారు. మరికొన్ని ఏళ్ల పాటు నగరాలకు ఈ ఇబ్బంది తప్పదని, ఫలితంగానే ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ జలవనరులు, నాలాలు, పార్కుల్ని పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. బుద్ధ భవన్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల
సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
కోర్ ఏరియాలో అధిక ఉష్ణోగ్రత...
సబ్ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే కోర్ సిటీలో మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటోంది. హీట్ ఐలాండ్‌గా పిలిచే దీంతో లోకల్ మాయిశ్చరైజర్ పెరుగుతోంది. దీనికి కాలుష్యం తోడు కావడంతో నీటి బిందువులుగా మారి క్లౌడ్ బరస్ట్‌లు జరుగుతున్నాయి. కాలంతో సంబంధం లేకుండా క్లౌడ్ బరస్ట్‌లు గడిచిన 25 ఏళ్లల్లో మూడు రెట్లు పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. రాజధానిలో 70 శాతం చెరువులు మాయమయ్యాయి. చాలా వరకు నాలాలు కనెక్టివిటీ కోల్పోయాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జెన్–జెడ్ కోసం జలవనరులు పరిరక్షిస్తున్నాం. పార్కుల పరిరక్షణతో వాతావరణంలో వేడిని తగ్గించే అవకాశం ఉంది.
పక్కా పథకం ప్రకారం కబ్జా పర్వం...
హైడ్రా ఏ ఒక్క నివాసం జోలికీ వెళ్లట్లేదు. ప్రజలు సోషల్‌మీడియా చూసి ఓ అభిప్రాయానికి రావద్దు. గాజుల రామారంలోనూ ప్రభుత్వ స్థలంలో 900 నిర్మాణాలు గుర్తించినా... ఇంకా పూర్తికాని 260 మాత్రమే కూల్చాం. భూ కబ్జాలకు పాల్పడే అసాంఘిక శక్తులు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. 300 గజాల స్థలంపై కన్నేసి దాని చుట్టూ ప్రహరీ కడుతున్నారు. 30 గజాల్లో ఓ షెడ్లు వేసి కుటుంబాన్ని తీసుకువచ్చి అందులో ఉంచి నివాసమని పేర్కొంటున్నారు. ఇలా ఉంటున్న వారికి కబ్జాదారులే నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ దాన్ని అమ్మేసిన తర్వాత మరోచోటుకు మారుస్తున్నారు. గాజులరామారంలో కబ్జాలు చేసిన వారితో పాటు సహకరించిన అధికారులపైనా చర్యలు ఉంటాయి. అక్కడ ఇళ్లు కొని నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్లు తమకు అమ్మిన వారి పేర్లు
చెప్పాలి.
హైడ్రాను మేనేజ్ చేయడం అబద్ధం..
వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడిన సంస్థలపై 11 కేసులు నమోదు చేయించాం. ఏ బిల్డర్, సంస్థా హైడ్రాను మేనేజ్ చేయలేదు. అలా ఎవరైనా చెప్తే అది అబద్ధమే అవుతుంది. మరో నెల రోజుల్లో హైడ్రా ఠాణా పని చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అంశంలోనూ కోర్టు ఆదేశాలను కచి్చతంగా పాటిస్తున్నాం. ఈ నెల 26న బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ల జారీ ఉంటుంది. ఆ తర్వాత వాటిలో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం హైడ్రా ఆరు చెరువులను పునరుద్ధరిస్తోంది. ఎవరైనా ముందుకు వచ్చిన సీఎస్సార్ నిధులతో చెరువులు అభివృద్ధి చేస్తామంటే అప్పగిస్తాం. ఇప్పటి వరకు 96 చోట్ల డ్రైవ్స్ నిర్వహించి రూ.50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాలను కబ్జా చెర నుంచి విడిపించాం.