ఎన్నికల పేరుతో జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌లు ప్రజలపై నిర్బంధం కొనసాగిస్తున్నారని,
ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: ఎన్నికల పేరుతో జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌లు ప్రజలపై నిర్బంధం కొనసాగిస్తున్నారని, బైండోవర్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని, వెంటనే వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
2009 ఎన్నికల సందర్భంగా ఎవరిపై కేసులు నమోదు చేశారో ప్రస్తుతం వారిపైనే ఎటువంటి ఆధారాలు లేకుండా బైండోవర్ కేసులు పెడుతున్నారని ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అఫ్రోజ్ సమీనా ఆయనకు తెలిపారు. గతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టిన వారు ప్రస్తుతం రూ.50వేలు పూచీకత్తు అడుగుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారుల నుంచి రాతపూర్వకంగా వివరణ కోరుతామని తెలిపారు. ఈ వినతిపత్రం అందించిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వై.విక్రమ్, నాయకులు ఎంఏ.ఖయ్యూం, ఎంఏ.జబ్బార్, వెంకన్న పాల్గొన్నారు.