ఎన్నికల హామీల అమలులో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల హామీల అమలులో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల్లో జాప్యానికి నిరసనగా 10 వామపక్ష పార్టీలు బుధవారం హైదరాబాద్‌తోపాటు, వివిధ జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించాయి. హైదరాబాద్‌లో ఊరేగింపుగా వచ్చిన 10 వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్), ఇతర వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ జరిపారు. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వివిధ పార్టీల నేతలు కలెక్టరేట్ రెండోగేటు వద్ద బైఠాయించారు. వరంగల్‌లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఆందోళనలో సీపీఐ నేత గుండా మల్లేశ్ మాట్లాడుతూ హామీల అమలుపై అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా, హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రుణమాఫీ మాటలకే పరిమితం కాగా.. అప్పుల భారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ నుంచి ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నిం చారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిలో ఆయన మాట్లాడారు.