ప్రజా సమస్యలను పరిష్కరించండి..

Collector Ronald Ross Orders To Officials On Grievence Application - Sakshi

అధికారుల వైపు నుంచిజాప్యం జరగొద్దు

ఆదేశించిన కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌  

గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదుల స్వీకరణ

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా నలుమూలల నుంచి గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో జేసీ వెంకట్రావు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వచ్చిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఫిర్యాదులు స్వీకరించి అధికారులకు పలు సూచనలు చేశారు. పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక సమస్యలతో ఫిర్యాదుదారులు వచ్చారు.

అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలాల అధికారులతో మాట్లాడిన కలెక్టర్‌ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించిన ఆయన.. కొందరు ఫిర్యాదుదారులు మళ్లీమళ్లీ రావడానికి కారకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తే వారికి ఇక్కడి వరకు వచ్చే ఇబ్బంది తప్పుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అందిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి...

నూతన భవనాన్ని నిర్మించాలి
జిల్లా కేంద్రంలోని పాతపాలమూర్‌ హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితి నెలకొందన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యలోగా నూతన భవన నిర్మాణం సాధ్యం కాకపోతే మరమ్మతులు అయినా చేయించాలని విజ్ఞప్తి చేశారు.

కౌలు రైతులకూ వర్తింపజేయాలి
ఎకరానికి రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు, పోడు రైతులతో సహా సాగుదారులందరికి వర్తింపజేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. భూ అ«ధీకృత సాగుదారుల చట్టం 2011 అమలు చేయాలన్నారు. సాగుఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పర్మినెంట్‌ చేయండి  
జిల్లాలోని కేజీబీవీలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరారు. చాలీచాలనీ వేతనాలతో పని చేస్తున్నందున తమను పర్మినెంట్‌ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కొత్తగా ఏర్పాటు చేసిన కేజీబీవీ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top