అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

collector divya devarajan told The petitions should be examined at the field level - Sakshi

‘గిరిజన దర్బార్‌’లో కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

ఉట్నూర్‌(ఖానాపూర్‌): గిరిజన దర్బార్‌కు వచ్చే ప్రతీ అర్జీని ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు కలెక్టర్‌ హాజరై గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్‌ మండలం చాందూరి గ్రామానికి చెందిన మేస్రం మారుతి వికలాంగ పింఛన్‌ అందించాలని విన్నవించగా.. పింఛన్‌ మంజూరుతో పాటు మూడు చక్రాల సైకిల్‌ పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ, డీడబ్ల్యూవోను కలెక్టర్‌ ఆదేశించారు.

అనంతరం కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌పై సమీక్షించారు. ఇటీవల వడగళ్లతో దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ఇన్సూరెన్స్‌ అధికారులతో ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఉపాధి, పింఛ న్ల మంజూరు, భూసమస్యలు, ఎకనామిక్‌ సపోర్టు స్కీం కింద రుణాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై 310 అర్జీలు రాగా వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీటీడీవో పోచం, ఏపీవో నాగోరావు, డీఆర్‌డీఓ రాజేశ్వర్‌ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, జిల్లా, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.  

నీటి సమస్య పరిష్కరించాలి
మా గ్రామంలో ఏళ్ల తరబడి నీటి సమస్య ఉంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉన్న చేతి పంపులు పాడైపోయినయ్‌. తాగునీళ్ల కోసం దూరంగా ఉన్న బోరింగ్‌ల వద్దకు వెళ్లాల్సి వస్తంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.        – నైతం శోభ, హస్నాపూర్‌

మూడేండ్ల సంది తిరుగుతన్నం..
మేం మూడేండ్ల సంది లోను కోసం తిరుగుతన్నం. ఎడ్లబండ్ల లోను కోసమని దరఖాస్తు  ఇచ్చాం. రెండేండ్ల కిందనే బ్యాంకు కన్సల్ట్‌ లెటర్‌ ఇవ్వడం జరిగింది. అయితే లోను మంజూరు అయినా మాకు సమాచారం అందక ఆగిపోయింది. అధికారులు తొందరగా స్పందించి లోను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలె.   -ఆదిలాబాద్‌ మండలం కొలాంగూడ గ్రామస్తులు

మేకల లోను మంజూరు చేయాలె
మాకు ఉపాధి కోసం మేకల లోను, పంట చేన్లకు నీటి సౌకర్యం కోసం బోర్‌వెల్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాం. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం.. లోను తొందరగా వస్తదని అనుకుంటున్నం.  -ఉట్నూర్‌మండలం చిన్నుగుడ గ్రామ గిరిజనులు
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top