కాళేశ్వర గంగకు సీఎం జలహారతి

CM KCR Visits Mid Manair Dam - Sakshi

సిరిసిల్ల మానేరు వంతెనపై గోదావరి జలాలకు పూజలు

మిడ్‌ మానేరు జలాశయం వద్ద జలహారతి

కుటుంబసభ్యులతో కలసి వేములవాడ రాజన్న దర్శనం

కోడె మొక్కులు చెల్లించిన కేసీఆర్‌

సిరిసిల్ల/మేడ్చల్‌రూరల్‌/బోయినపల్లి(చొప్పదండి)/వేములవాడ: కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్‌ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్‌ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్‌ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి.

అయితే 2016 తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో మిడ్‌ మానేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి నీటిని మిడ్‌ మానేరులో నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నవంబర్‌ 8 నుంచి ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంపుహౌస్‌ ద్వారా ఎత్తిపోయడంతో మిడ్‌ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. జలకళతో ఉట్టిపడుతున్న జలాశయానికి సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరడంతో సీఎం కేసీఆర్‌ పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జెడ్పీ చైర్‌పర్సన్లు న్యాలకొండ అరుణ, కనుమల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్‌ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్గే తదితరులు పాల్గొన్నారు.

సోమవారం సిరిసిల్ల వంతెనపై గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో సీఎం కేసీఆర్‌ దంపతులు, వినోద్‌కుమార్

సీఎం వెంట ఈటల కుటుంబీకులు
సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబీకులను వెంట తీసుకుని వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కుటుంబంతో సహా రావాలని కేసీఆర్‌ కోరారు. దీంతో మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామంలో ఉండే మంత్రి ఈటల రాజేందర్‌.. శామీర్‌పేటలో ఈటల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో కలసి కేసీఆర్‌ బస్సు ఎక్కారు.

సరిగ్గా పదేళ్లలో..
తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్‌ 2009 నవంబర్‌ 8న సిరిసిల్ల మానేరు వంతెనపై బట్టలు మార్చుకుంటూ.. పని ఒత్తిడితో కనిపించారు. మళ్లీ అదే వంతెనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మంత్రులు.. అధికారులతో మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌కు పూజలు చేశారు. పదేళ్ల కిందట రాష్ట్ర సాధన ఉద్యమంలో బిజీగా ఉన్న సమయంలో కేసీఆర్‌ సిరిసిల్లలో బస చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల మీదుగా హైదరాబాద్‌ వెళ్తూ.. ఢిల్లీకి విమానంలో వెళ్లే హడావుడిలో మానేరు వంతెనపై బట్టలు మార్చుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను సిరిసిల్ల ప్రజలు సోమవారం గుర్తు చేసుకున్నారు.

సీఎంకు నిరసన సెగ
సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నుంచి రోడ్డుపైకి ఊరేగింపుగా వస్తున్న మహిళలను, యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసన కారులకు తోపులాట జరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడ వాసులు సీఎం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురికి ప్యాకేజీ డబ్బులు అందాల్సి ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు సీఎంకు విన్నవించుకుందామని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ను ఏబీవీపీ నేతలు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మహిళలకు గాయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి సీఎం బస్సులో వెళ్తుండగా, ఆయనను చూసేందుకు సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో ఓ చోట పేర్చిన విద్యుత్‌ స్తంభాలపై 20 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం బస్సు రావడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిల్చోవడంతో స్తంభాలు అదుపుతప్పి పక్కకు కూలాయి. దీంతో నక్షత్ర(19), వెంకాయమ్మ(35)లకు తీవ్ర గాయాలయ్యాయి.  

వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్‌

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్‌చైర్మన్‌ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top