సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR To Hold Review Meeting On RTC Strike in Today Evening - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్‌ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే  ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. 

కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు.

చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..!

సమ్మెపై సాయంత్రానికి స‍్పష్టత
తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస‍్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top