ఆ నిధులు.. ఏ ఖాతాలోకి..! 

Clarity on surplus funds - Sakshi

ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ 

మిగులు నిధులపై స్పష్టత లోపం

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధికి చెందిన మిగులు మొత్తం రానున్న ఏడాది బడ్జెట్‌ నిధులకు జతపరిచే విషయంలో గందర గోళం తలెత్తింది. ఖర్చుకాకుండా మిగిలిన మొత్తం ఏమి చేయాలనే దానిపై స్పష్టత కొరవడి అవి ఏ పద్దుల్లో చూపించాలో తేలకుండానే ఈ కార్యక్రమానికి తొలిఏడాది ముగిసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్‌డీఎఫ్‌ కింద కేటాయించిన నిధులను సంతృప్తికర స్థాయిలో ఖర్చయినట్లు ప్రభుత్వం అంచనాకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎస్‌డీఎఫ్‌ చట్టం ప్రకారం.... తొలి ఏడాది కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే, వాటిని మరుసటి ఏడాది బడ్జెట్‌కు జత చేయాలి. అలా మిగులు నిధులతో పాటు తాజా కేటాయింపులను వార్షిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఈ నిబంధన ప్రకారం 2017–18 వార్షిక సంవత్సరం మిగులు నిధులను ప్రస్తుత నిధికి జోడించాలి. కానీ గతేడాది ప్రభుత్వం మిగులు నిధుల జోడింపు అంశాన్ని పక్కనపెట్టేసింది. 

మరి 4,846.45 కోట్లు...ఏ ఖాతాలోకి... 
2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్డీఎఫ్‌) కింద ప్రభుత్వం రూ.14375.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 42శాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా... మార్చి చివరికి రూ.11,284.7 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రాథమికంగా లెక్కలు తేల్చింది. అదేవిధంగా ఎïస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్డీఎఫ్‌) కింద రూ.8,165.8 కోట్లు కేటాయించగా... ఏడాది చివరకి రూ.6410.15 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేసింది. ఈ రెండింటా రూ.4,846.45 కోట్లు మిగిలిపోయాయి.

ఈక్రమంలో ఖర్చులను బడ్జెట్‌ వ్యయంతో దాదాపు సమానం చేసిన యంత్రాంగం రానున్న బడ్జెట్‌కు ఈ నిధులు జోడించే అంశం పక్కన పెట్టేసింది.  ఆర్థికశాఖ నుంచి వివరాలు రావాలనీ, అక్కడ్నుంచి శాఖల వారీగా ఖర్చులు వెల్లడైతేనే వాటిని వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top