నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు..: చిరంజీవి

Chiranjeevi reacts on Thief in his House  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: తన నివాసంలో జరిగిన చోరీపై ప్రముఖ నటుడు చిరంజీవి‍ స్పందిస్తూ..  నిందితుడు చెన్నయ్య తమ కుటుంబానికి నమ్మకంగా ఉండేవాడని అన్నారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకడిగా ఉండేవాడని, ఇంట్లో జరిగే అన్ని వేడుకల్లోనూ పాల్గొనేవాడన్నారు. అలాంటిది సొంత మనిషిలా చూసుకున్నా.. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చిరంజీవి కుటుంబసభ్యుల గ్రూప్‌ ఫొటోల్లో కూడా చెన్నయ్య ఉండటం గమనార్హం. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సినిమా ఫంక్షన్లకు కూడా చెన్నయ్యను ప్రత్యేకంగా తీసుకెళ్లేవారని సమాచారం.

కాగా చిరంజీవి ఇంట్లో నగదు చోరీ చేసిన చెన్నయ్యను జూబ్లీహిల్స్‌ పోలీసులు నిన్న అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితుడి నుంచి రూ. 1.50 లక్షల నగదు రికవరీ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన చెన్నయ్య పదేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 25లోని చిరంజీవి ఇంట్లో వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తూ రాజీవ్‌గాంధీ నగర్‌లో  ఉండేవాడు. గత నెల 30న అతను చిరంజీవి నివాసంలో కప్‌బోర్డ్‌లో ఉన్న రూ. 2 లక్షలు దొంగిలించాడు.

ఈ నెల 7న చిరంజీవి మేనేజర్‌ గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి నగదును రికవరీ చేశారు. ఆర్ధిక అవసరాల కోసమే తాను నగదు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. చోరీ సొత్తులో రూ. 50 వేలు ఇంటి ఖర్చులకు వాడుకున్నాడని మిగతా డబ్బును ఇంట్లోనే భద్రంగా ఉంచినట్లు తెలిపాడు. నమ్మకంగా పని చేస్తూనే యజమాని కళ్లగప్పి కప్‌బోర్డ్‌లో ఉన్న డబ్బులను విడతల వారిగా చోరీ చేసినట్లు పోలీసులు వివరించాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top