కన్నీటికథ...తీరని వ్యధ | children facing problems with nerve degeneration disease | Sakshi
Sakshi News home page

కన్నీటికథ...తీరని వ్యధ

Nov 13 2014 11:29 PM | Updated on Sep 2 2017 4:24 PM

దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మోతె గ్రామానికి ...

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మోతె గ్రామానికి చెందిన మాదాసు నాగ రాములుకు దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన మహేశ్వరితో 21 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి భరత్(17), అభిలాష్(14) సంతానం. చిన్నారులిద్దరూ అందరిలాగే ఆడుతూ, పాడుతూ బడికి వెళ్తుంటే రాములు, మహేశ్వరి దంపతులు సంబరపడిపోయారు.

మనమిద్దరం..మనకిద్దరంటూ ఆనందంలో మునిగిపోయారు. వచ్చేకొద్దిపాటి డబ్బుతోనే ఈ చిన్న కుంటుంబం ఏ చింతా లేకుండా సాగేది. వీరిని చూసి ఆ విధికి కన్నుకుట్టింది. భరత్ మూడో తరగతి చదువుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి బక్కచిక్కిపోయాడు...సరిగ్గా అదే సమయంలో అతని తమ్ముడు అభిలాష్ కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆందోళన చెందిన  రాములు, మహేశ్వరిలు చిన్నారులిద్దరినీ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

పిల్లలను పరీక్షించిన వైద్యులు ఇలాంటి వ్యాధులు అధికంగా మేనరికంతోనే వస్తుంటాయని నిర్ధారించారు. అయితే తమది మేనరికం కాదని నాగ రాములు, మహేశ్వరిలు చెప్పడంతో వైద్యులు సీడీ ఎఫ్‌డీ(సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ఫ్రింట్ అండ్ డయాగ్సిసీస్)లో భరత్, అభిలాష్‌లకు పరీక్షలు నిర్వహించారు. ఇరువురికీ కండరాలక్షీణత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.

ఇలాంటి వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుందని, ఈ వ్యాధి వచ్చిన వారు జన్యులోపం మూలంగా రోజురోజుకూ నరాలు చచ్చుబడిపోవడంతో కండరాలు క్షీణిస్తూ జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు. దీంతో హతాశయులైన నాగరాములు, మహేశ్వరి మేమేం పాపం చేశామురా దేవుండా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అంతటితో ఆగిపోకుండా తమ కంటి పాపలను కాపాడుకునేందుకు అలోపతి, హోమియోపతి..ఇలా ఎవరు ఏ సలహా ఇస్తే ఈ వైద్యం అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.

 చిక్కిశల్యమై..తల్లిదండ్రులకు భారమై
 రోజురోజుకూ చిన్నారులిద్దరూ చిక్కిపోతుండడం.. వారి వైద్యం కోసం వేలకువేలు వెచ్చించడం భారంగా మారడంతో నాగరాములు, మహేశ్వరిలు తమ మకాంను దుబ్బాక మండల కేంద్రానికి మార్చారు. నాగరాములు చిన్నపాటి కొట్టు పెట్టుకుని ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతుండగా, మహేశ్వరి బీడీలు చుడుతూ భర్తకు ఆసరాగా ఉంటోంది.

ఈ పరిస్థితుల్లో కూడా తమ చిన్నారులిద్దరికీ వైద్యం చేయిస్తూ స్థానిక ఆదర్శ విద్యాలయంలో ఆరో తరగతి వరకు చదివించారు. అయితే రానురానూ పిల్లలు పూర్తిగా నడవలేని పరిస్థితికి రావడంతో వారి చదువులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం భరత్, అభిలాష్‌లు కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలోకి చేరుకోవడంతో తల్లిదండ్రులే అన్నీ తామై వారికి సపర్యలు చేస్తున్నారు.
 
 
 సాయం చేయాలనుకునేవారు
 నాగరాములు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అకౌంట్ నంబర్:  62295798781, చీకోడ్ బ్రాంచ్, దుబ్బాక మండలం.

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీహెచ్‌వై 0021551
 లేదా చిన్నారుల తండ్రి నాగరాములు ఫోన్ నంబర్:  9848875766లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement