944/1000

Child Sex Ratio Is Decreasing In Telangana State - Sakshi

లింగ నిష్పత్తి అంతరం తగ్గుతోంది 

రెండేళ్లలో భారీ మార్పులు 

2018లో 1000:944గా నమోదు 

2016లో వెయ్యికి 880 మంది ఆడ శిశువులు 

ఇప్పటికీ వెనకబడ్డ జనగామ.. 

1000:864గా నమోదు 

రెండేళ్లలో తగ్గిన జననాల సంఖ్య  

సాక్షి, హైదరాబాద్‌ : సమాజపు ఆలోచనలో వస్తున్న మార్పులో.. బేటీ బచావ్‌ బేటీ æపఢావ్‌ వంటిపథకాలో.. స్వచ్ఛంద సంస్థల చైతన్య కార్యక్రమాలో తెలియదు గానీ.. రెండేళ్లుగా తెలంగాణలో శిశువుల్లో లింగ నిష్పత్తిలో అంతరం తగ్గుతూ వస్తోంది. 2018లో నమోదైన జననా ల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపించింది. దీని ప్రకారం.. రెండేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే రాష్ట్రంలో శిశు జననాల్లో లింగ నిష్పత్తి అంతరంలో చాలా మార్పు వచ్చింది. 2018లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 944 మంది ఆడ శిశువులు జన్మించినట్లు నివేదిక పేర్కొంది.

2016లో తెలంగాణలో ఈ నిష్పత్తి 1000:880గా నమోదైంది. 2017లో బాలికల సంఖ్య 914కి చేరగా ఈసారి 944గా నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూస్తే గతేడాది అత్యధికంగా వనపర్తి జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 985 మంది ఆడ శిశువులు జన్మించారు. తర్వాత వికారాబాద్‌ జిల్లాలో 984మంది ఆడ శిశువులు పుట్టారు. పలు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది ఆడ శిశువులు జన్మించారు. జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి–కొత్తగూడెం, పాలమూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్‌ జిల్లాలు రాష్ట్ర సగటును దాటేశాయి. మిగిలిన జిల్లాలు సగటు కన్నా తక్కువగా ఉన్నాయి.

అత్యంత తక్కువగా జనగామ జిల్లాలో వెయ్యి మందికి కేవలం 864 మంది ఆడ శిశువులే జన్మించారు. ఆ తర్వాత ఆసిఫాబాద్‌–కొమురంభీం జిల్లాలో 883 మంది ఉన్నారని నివేదిక తెలిపింది. 2016లో కరీంగనగర్‌లో ఈ నిష్పత్తి 1000:716గా నమోదవగా 2018లో ఈ సంఖ్య 1000:923కి చేరుకుంది. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించడంతో.. పరిస్థితి చాలా మెరుగుపడింది. 
 
తగ్గిన జననాలు 
రాష్ట్రంలో జననాల సంఖ్య నాలుగేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 2018లో తెలంగాణలో 6,03,919 మంది జన్మించారు. అందులో 3,10,594 మంది మగ శిశువులు, 2,93,325 మంది ఆడ శిశువులు. అత్యధికంగా హైదరాబాద్‌లో 79,359 మంది పుట్టారు. మేడ్చల్‌ జిల్లాలో 43,846, నిజామాబాద్‌ జిల్లాలో 38,027 జననాలు నమోదయ్యాయి. అయితే నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి జననాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. 2015లో 6,12,489 మంది జన్మించగా, 2016లో 6,24,581 మంది, 2017లో 6,17,620 మంది జన్మించారు. 2017తో పోలిస్తే ఈసారి 13,701 మంది తక్కువగా పుట్టడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top