బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు

Child Line Officials Stopped Child Marriages - Sakshi

జడ్చర్ల: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెబ్బేరు మండలం కంబాలపురం గ్రామానికి చెందిన ఓ బాలిక(17)కు బాదేపల్లిలో నివాసం ఉంటున్న ఖిల్లాఘనపురం గంగాధర్‌(24)తో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ మేరకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుండగా ఆకస్మికంగా పోలీసులు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కూతురు వయస్సు మైనార్టీ తీరలేదని, నిర్ణీత వయస్సుకు తక్కువగా ఉన్నా పెళ్లి చేస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు సీఐ బాలరాజుయాదవ్‌ ఆలయానికి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం పెళ్లి కూతురును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసిందని, స్కూల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా పెళ్లిని రద్దు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాలికను శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించడంతో వారు మహబూబ్‌నగర్‌ తీసుకెళ్లారు.

దోనూరులో..
మిడ్జిల్‌ (జడ్చర్ల): మండలంలోని దోనూరులో గురువారం తహసీల్దార్‌ పాండునాయక్, పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక(16)ను హైదరాబాద్‌లోని ఉలాల్‌గడ్డకు చెందిన యువకుడితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు వచ్చి తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పెళ్లిని నిలిపివేయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top