ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా అర్బన్‌ పార్కులు

Chief Secretary Somesh Kumar Visits Kandlakoya Oxygen Park - Sakshi

కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కును సందర్శించిన సీఎస్‌

సాక్షి,హైదరాబాద్‌/మేడ్చల్‌: రాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు రాబోయే రోజుల్లో ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును సీఎస్‌ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడల్‌ పార్కు (మియావాకి ప్లాంటేషన్‌)లో రాష్ట్రమంతటా కనీసం ఒక ఎకరంలో భారీగా మొక్కలు నాటి చిట్టడవులుగా మారుస్తామని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి శాచురేషన్‌ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపడతామని,ఫెన్సింగ్‌ నిర్మిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో కొద్దిసేపు పాల్గొన్న మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్‌ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌పార్కు ఆహ్లా దకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ తదితర వివరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 5 కి.మీ పరిధిలో 59 అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 16 న సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని వెల్లడించారు. వీటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని సీఎస్‌కు పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జాయింట్‌ సెక్రటరీ ప్రశాంతి, మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్‌లు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top