అందరి బంధువు

Chevella Constituency Review on Lok Sabha Election - Sakshi

‘చేవెళ్ల’ మనసులో మాట

కేసీఆర్‌ సంక్షేమ పథకాలపై జనం స్పందన

అందరి కోసం అన్నీ చేశారని కితాబు

కేంద్రంలో మోదీ మళ్లీ రావాలని కొందరు..

ప్రజాభిమానం చూరగొని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ మద్దతు పలుకుతున్నారు జనం. కేసీఆర్‌ పేదోళ్ల గురించి ఆలోచన చేసే నాయకుడని, ఐదేళ్ల కాలంలో ఆయన అందరి అభివృద్ధికి, అన్ని వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేశారని కితాబునిచ్చారు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్‌ లబ్ధిదారులు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. నిరంతర కరెంట్‌ సరఫరాపై ప్రజలు.. ముఖ్యంగా రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కరెంటు సరఫరా మంచిగా ఉండడంతో వ్యాపారాలు, పరిశ్రమలు బాగున్నాయని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు చెప్పారు. రైతుల్లో కరెంట్‌ సరఫరా, రైతుబంధు పథకాలు బలంగా నాటుకుపోయాయి. రైతులతో పాటు మహిళలు కూడా టీఆర్‌ఎస్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. పింఛన్లు పెంచారని, తాము టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని పలువురు వృద్ధులు చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ‘సాక్షి’ రోడ్‌షో నిర్వహించింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల వెంట నిర్వహించిన ఈ రోడ్‌ షోలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘కేసీఆర్‌ పథకాలు బాగున్నాయి.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామ’ని కొందరు చెప్పగా.. మరికొందరు ‘మోదీ దేశానికి సేవ చేశారని, మళ్లీ ఆయనే అధికారంలోకి రావాల’ని ఆకాంక్షించారు. కొందరు కేంద్రంలో మూడో ఫ్రంట్‌ రావాలని కూడా ఆకాంక్షించారు. రోడ్డు షోలో ఎవరెలా స్పందించారంటే..- సాక్షి, నెట్‌వర్క్‌

రోడ్డు షోలో ఎదురుపడిన పలువురిని పలకరించినప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కారు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రైతుబంధు, బీమా, ఆసరా పింఛన్ల పథకాలపై జనం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వచ్చాక తమ కష్టాలు తీరిపోయాయని చిన్న పరిశ్రమల నిర్వహకులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ‘గతంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఒక్కోసారి రోజంతా కూడా చీకట్లోనే మగ్గిపోయే వాళ్లం. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు కరెంట్‌ ఉంటోంది. సాగు సమస్య లేదు.. పరిశ్రమలు ఎలా నడపాలన్న చింతే లేదు’ అని పెద్దసంఖ్యలో స్పందించారు. ‘కేసీఆర్‌ ఒక సమాజంలో ఎవరెవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చి పెట్టారు. ప్రతి ఇంటికి ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరుతోంది. అటువంటప్పుడు ఇంకెవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నే లేదు’ అని ధారూర్‌కు చెందిన విద్యార్థి అజయ్‌ చెప్పారు. మొత్తం 165 కిలోమీటర్ల మేర సాగిన రోడ్డు షోలో అత్యధికులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తినే వ్యక్తం చేశారు.

మరోసారి మోదీ..
నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని, ఆయన వస్తేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కొందరు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పనితీరు బాగుందని, దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. ‘ఐదేళ్లలో బీజేపీ మంచిపనులు చేసింది. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి అడ్డుకట్ట వేసింద’ని కూడా అన్నారు. బీజేపీ హయాంలో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఖ్యాతి పెరుగుతోందన్నారు. కొందరు మాత్రం ‘ఇక్కడ ఓటు టీఆర్‌ఎస్‌కు వేస్తాం.. కానీ కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం’ అని చెప్పడం విశేషం. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని, ఎప్పుడూ ఏదో ఒక లీడర్‌ ఏదో ఒక కుంభకోణంలో ఇరుక్కుంటూనే ఉంటారని కొందరు స్పందించారు.  

రియల్‌ వెంచర్లుగామారుతున్న పొలాలు 
ధరలు పెరిగాయి
ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరిగిందని కొందరు అభిప్రాయపడ్డారు. బీజేపీ హయాంలో నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్‌ రేట్లు పెరిగాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దేశ రక్షణ విషయాలను బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోం దని కొందరు విమర్శించారు. రాహుల్‌గాంధీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో.. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ పథకం (న్యాయ్‌) అమలైతే చాలా పేద కుటుంబాలు బాగు పడతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. గతంలో ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఇప్పుడు కనీస ఆదాయ పథకం ద్వారా కేంద్రంలో ఆ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందని ఒకరిద్దరు విశ్వాసం వ్యక్తం చేశారు.  

పరిశ్రమలు రావాలి..
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారి వెంట ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పది కిలోమీటర్ల పరిధిలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. దాదాపు 1,500 ఎకరాల ఈ అటవీ ప్రాంతం కేంద్రం పరిధిలో ఉంది. దీనిని ఏదైనా పరిశ్రమలకు ఉపయోగిస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుతున్నారు.

సుస్థిర పాలనకే మద్దతు
బీజేపీ పెద్ద నోట్లను రద్దుచేసి నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రోత్సహించింది. నెట్‌బ్యాంకింగ్‌ లావాదేవీలతో దొంగల భయం ఉండదు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. మోదీనే మళ్లీ సుస్థిర పాలన అందిస్తారు.– కె.రాములు,కేరెళ్లి, ధారూరు మండలం

మోదీ వస్తేనే..
నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రిగా వస్తేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. మోదీ పాలనలో అభివృద్ధి స్పష్టంగా కన్పిస్తోంది.
– రవీందర్‌గుప్తా, వ్యాపారి,దెబ్బడగూడ, కందుకూరు మండలం

రోడ్‌షో సాగిందిలా..
 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వెళ్లే హైదరాబాద్‌–బీజాపూర్, హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారులపై ‘సాక్షి’ బృందం ప్రయాణించింది.  అలాగే, హైదరాబాద్‌–శ్రీశైలం రాష్ట్ర రహదారిపై కూడా ప్రయాణించి.. దారిలో ఎదురుపడిన వారి నుంచి వివిధ అంశాలపై స్పందన కోరింది.  మరో రెండు రాష్ట్ర రహదారులను కూడా కలిపి మొత్తం 165 కిలోమీటర్లు పర్యటించి వివిధ వర్గాల ప్రజలను పలకరించి వారి అభిప్రాయాలను సేకరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top