కేసులే.. ఫైన్లు లేవ్‌.. | Cases Files on Multiplex In Hyderabad But No Actions | Sakshi
Sakshi News home page

కేసులే.. ఫైన్లు లేవ్‌..

Aug 6 2018 11:50 AM | Updated on Sep 4 2018 5:53 PM

Cases Files on Multiplex In Hyderabad But No Actions - Sakshi

మల్టీప్లెక్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న తూనికలు,కొలతల శాఖ అధికారులు

సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్లలో ఎమ్మార్పీ అమలు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం  ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ చట్టం అమలుపై  స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది.  పౌరసరఫరాల శాఖ అధికారులు  ఈ నెల 1 నుంచి  ఎమ్మార్పీ అమలు చేయాలని ఆయా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన సైతం కల్పించినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారింది. నిబంధనల అమలుపై నిరంతర తనిఖీలు చేపడతామని హెచ్చరించినా కనీస స్పందన కరువైంది.దీనిని తీవ్రంగా పరిగణించిన తూనికలు, కొలతల శాఖ ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై  దాడులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను 30 మందితో కూడిన  ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

107 కేసులు నమోదు
గ్రేటర్‌ పరిధిలో మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో ఎమ్మార్పీ నిబంధనల ఉల్లంఘనపై తూనికలు, కొలతల శాఖ అధికారులు ఇప్పటి వరకు  107 కేసులు నమోదు చేశారు. నగరంలో సుమారు 28 మల్టీప్లెక్స్‌లు ఉండగా ఈ నెల 2న, 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించి, 18 థియేటర్లపై 54 కేసులు నమోదు చేసింది.  3న 8 మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 6 మల్టీప్లెక్స్‌లపై 19 కేసులు, 21 సాధారణ సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో తనిఖీలు నిర్వహించి14 థియేటర్లపై 17 కేసులు నమోదు చేశారు. తాజాగా ఆదివారం 17 మల్టీప్లెక్స్‌లలో రెండో దఫా తనిఖీలు నిర్వహించగా  నిబంధనలు పాటించని 12 మల్టీప్లెక్స్‌లపై 17 కేసులు నమోదు చేశారు. 

ఫిర్యాదుల వెల్లువ
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి తూనికల కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబర్, వాట్సప్‌ నంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. రెండురోజుల్లోనే దాదాపు రెండు వందలకు పైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించకుండా ఎమ్మార్పీకి మించి ధరలు వసూ లు చేస్తే వాట్సప్‌ నంబర్‌ 7330774444, టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333లకు  ఫిర్యాదు చేయా లని తూనికలు, కొలతల శాఖ సూచించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లపై ఎక్కువగా ఫిర్యాదులు అందడం విశేషం. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని తూనికల కొలతల శాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

కేసులు సరే... జరిమానా ఏదీ?...
మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలుతల శాఖ కేవలం కేసుల నమోదుతో  చేతులు దులుపుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది.  రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష తప్పవని హెచ్చరించింది. కాగా మల్టీప్లెక్స్, థియేటర్లపై వరసగా రెండురోజులు జరిపిన దాడుల్లో నిబంధనల ఉల్లంఘనపై సుమారు 88  కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement