
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు వేధింపులు..కేసు నమోదు
అమెరికాలో నివాసముంటున్న హైదరాబాద్ యువతిని మానసికంగా వేధిస్తున్న ఓ ప్రబుద్ధుడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
హస్తినాపురం(హైదరాబాద్): అమెరికాలో నివాసముంటున్న హైదరాబాద్ యువతిని మానసికంగా వేధిస్తున్న ఓ ప్రబుద్ధుడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురానికి చెందిన ఓ యువతి అమెరికాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఉండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాచారానికి చెందిన మలిశెట్టి సాగర్ (42) గత ఏడాది సెప్టెంబర్‌లో నగరానికి వచ్చి వనస్థలిపురంలో ఉంటున్న యువతి అత్తామామలకు ఆ యువతి మార్ఫింగ్ చేసిన ఫొటోలను అందజేశాడు. దీంతో వారు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పొరపాటు జరిగిందని సాగర్ క్షమాపణలు చెప్పి, రాజీ కొచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లిన తరువాత మలిశెట్టి సాగర్ ఆ యువతిని వేధించసాగాడు. బాధితురాలి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి యువతి అత్తగారింటికి మరోసారి పోస్టులో పంపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, సౌభాగ్యలక్ష్మీ, సమీప బంధువు చింతల్‌కుంటకు చెందిన లక్ష్మీనారాయణపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.