మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది.
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీ కౌన్సిలర్లను క్యాంపుకు తీసుకెళ్లే పనిలో బిజీ అయ్యారు. స్పష్టైమైన మెజార్టీ రాకపోవడంతో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారింది. పట్టణంలోని 31 వార్డులకు గాను 11 కాంగ్రెస్, 8 ఎంఐఎం, 4 బీజేపీ, 2 టీఆర్‌ఎస్, 5 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందగా సీపీఎం ఒక స్థానంలో గెలిచింది.
చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే 16 మంది అభ్యర్థులు అవసరం ఉంటుంది. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతరుల మద్దతు కూడగట్టుకోకుండా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం సాధ్యం కాదు.ఇందుకోసం మాజీ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి మరోసారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందిన చాకలి స్వప్న, కసిని రాజుతో పాటు 27వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన వీణను కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇండిపెండెంట్‌లను ఒప్పించే పనిలో సఫలమయ్యారని చెప్పవచ్చు. దీంతో మున్సిపాల్టీలో కాంగ్రెస్ బలం 14కు చేరింది. 28వ వార్డు సీపీఎం అభ్యర్థి బి.మల్లేశం సైతం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సహచరుల ద్వారా సంకేతాలు పంపారు. దీంతో పాటు బీజేపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు మద్దతు ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని ఇదివరకే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరినట్లు తెలిసింది. ఎంఐఎం కట్టడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో బీజేపీ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా బీజేపీకి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
క్యాంపులో కాంగ్రెస్ కౌన్సిలర్లు
మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు చేజారకుండా ఉండేందుకుగాను కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి క్యాంపునకు తీసుకవెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం కౌన్సిలర్లతో పాటు తనకు మద్దతు ఇచ్చే ఇండిపెండెంట్, ఇతర పార్టీ కౌన్సిలర్లను ఈ నెల 19 నుంచి క్యాంపునకు తీసుకవెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సైతం బొంగుల విజయలక్ష్మిని చైర్‌పర్సన్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 11 మందిలో చైర్మన్ స్థానానికి ఎవరు పోటీ పడడం లేదు. దీంతో దాదాపుగా మరోసారి బొంగుల విజయలక్ష్మి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు.


