నీళ్ల యంత్రం.. పొదుపు మంత్రం

Btech student Sandeep founded Water meter - Sakshi

రూపొందించిన బీటెక్‌ విద్యార్థి సందీప్‌ను ట్విట్టర్‌లో అభినందించిన కేటీఆర్‌

కమలాపూర్‌ (హుజూరాబాద్‌): వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి మిట్టపెల్లి సందీప్‌ స్నేహితులతో కలసి వాటర్‌ మీటర్‌ను రూపొందించాడు. సందీప్‌ అనంతసాగర్‌లోని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. నీటి వృథాను అరికట్టడానికి స్నేహితులు శశిప్రీతమ్, శ్రీవిద్య, సాయితేజతో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్‌ మీటర్‌ను రూపొందించి ఒక యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక రోజు ఎన్ని నీళ్లు కావాలనేది ఈ యాప్‌ ద్వారా సెలెక్ట్‌ చేసుకుంటే అన్ని నీళ్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థుల బృందం గతేడాది సెప్టెంబర్‌లో నిట్‌ వరంగల్‌లో జరిగిన సెమీ ఫైనల్స్‌లో వాటర్‌ మీటర్‌ను ప్రదర్శించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో జరిగిన ఫైనల్స్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచారు.

అలాగే ఈ ఏడాది మార్చి హైదరాబాద్‌లో జరిగిన టైగ్రాడ్‌ గ్లోబల్‌ ఈవెంట్‌లో సైతం పాల్గొని ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో టీఎస్‌ఐసీతో విద్యార్థుల బృందానికి సంబంధాలు పెరగడంతో పాటు ఎలవేటర్‌ పిచ్‌ వీడియోను ట్విట్టర్‌లో పెట్టారు. వీటన్నింటిని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్‌ ఇండియా తెలంగాణ యాత్రలో అప్‌లోడ్‌ చేసి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌తోపాటు కేటీఆర్, జేఎస్‌ రంజన్, జీహెచ్‌ఎంసీ అధికారులకు ట్యాగ్‌ చేశారు. స్టార్టప్‌ ఇండియా యాత్రను పూర్తిగా సపోర్ట్‌ చేస్తున్న కేటీఆర్‌ వాటర్‌ మీటర్‌ను చూసి స్పందించి సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో రెండు, మూడు రోజుల పాటు డెమోకు రావాలని సందీప్‌ బృందాన్ని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆహ్వానించారు. కాగా ఈ వాటర్‌ మీటర్‌ను మిషన్‌ భగీరథకు పథకానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top