అందని ద్రాక్షగా వీడీఎస్‌

Bribery Demand For VDS in Water Works Quthbullapur - Sakshi

అమ్యామ్యాలు లేకుంటే నో వీడీఎస్‌

సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన ఫీజుబులిటీ

చింతల్‌: అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్‌ స్కీమ్‌) ప్రవేశపెట్టిన వీడీఎస్‌ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్‌ వాటర్‌ వర్క్స్‌ డివిజన్‌ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్‌ వర్క్స్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్‌ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒక్కో పనికి.. ఒక్కో రేటు..
వాలంటరీ డిస్పోజల్‌ స్కీమ్‌తో ప్రతి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెండు కనెక్షన్లు ఉన్న వారు సైతం వీడీఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. కాగా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బదలాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు తమ సిబ్బంది తెచ్చిన వాటినే స్వీకరిస్తూ మిగతా వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడపనిదే ఫైల్‌ ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఒక్కో రేటు చొప్పున ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫైల్‌ రిజక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడీఎస్‌ దరఖాస్తులు అధికారుల వద్దకు చేరినా క్రమబద్ధీకరణకు గడువు ముంచుకొస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. చివరి నిమిషంలో ఫైల్‌ నాట్‌ సబ్‌మిటెడ్‌ అంటూ రిజెక్ట్‌ చేస్తున్నారని కొంతమంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు అప్‌లోడ్‌ చేసినా నేటికీ ఆర్డర్‌ కాపీ/ఫీజుబులిటీ కాపీలు రావడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. 

సిబ్బందే మీడియేటర్లు..
వీడీఎస్‌ స్కీమ్‌ దరఖాస్తులను సిబ్బందే మీడియేటర్లుగా మారినట్లు సమాచారం ఒక్కో కనెక్షన్‌కు రేట్లు మాట్లాడుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎటువంటి పనులు లేకపోయినా ఆ పని.. ఈç పని అంటూ ఉదయం రావడంతో పైరవీలు చేయడం వారి దినచర్యగా మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వసూళ్ల పేరుతో ఉద్యోగం చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొత్త కనెక్షన్ల విషయంలోనూ వారే అధికారులకు వెన్నుదన్నుగా ఉండి నూతన భవనానికి గోతులు తీయగానే గద్దల్లా వాలిపోయి కనెక్షన్‌ల పైరవీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు నేరుగా కార్యాలయానికి వచ్చే వారిని మధ్యవర్తుల వద్దకు పంపుతున్నట్లు కోడై కూస్తోంది. అధికారులు ఎక్కడా నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు జరుపకుండా మధ్యవర్తులనే ముందు నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇష్టారాజ్యంగా త్రిబుల్‌ టైమ్‌ బిల్లులు..
డివిజన్‌ పరిధిలోని వివిధ సెక్షన్‌లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్‌ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్‌ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్‌ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి సోమవారం  ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top