
ప్రస్తుత పరిధి 1,450 చదరపు కిలోమీటర్లు
2050 చదరపు కిలోమీటర్లకు విస్తరణ
తాగునీరు, డ్రైనేజీ నెట్‌వర్క్ కోసం ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మణిహారంగా ఉన్న జలమండలి ఇక మహా జలమండలిగా మారనుంది. తాగునీటి, సీవరేజీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి ప్రాంతాలకు నెట్‌వర్క్ ఉండగా, వెలుపల కూడా విస్తరించే చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో నాలుగు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్తు, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టి పెట్టుకొని సీవరేజీ, వాటర్ ప్రాజెక్టు సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆదేశించారు.
2050 చదరపు కిలోమీటర్లు
జలమండలి నెట్‌వర్క్ 1,450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా.. 2,050 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కోర్ సిటీలో 169.3 చ. కి.మీటర్లు, చుట్టుపక్కల 518.9 చ.కి.మీటర్లు, ఓఆర్‌ఆర్ పరిధిలో 762 చ.కి.మీటర్లు విస్తరించి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో 600 చ.కి.మీటర్ల నెట్‌వర్క్ కోసం కసరత్తు చేస్తోంది. మహా విస్తరణ మాస్టర్ ప్లాన్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. వాటర్, సీవరేజ్ పైప్‌లైన్లతోపాటు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టి శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం కోసం కూడా దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలని యోచిస్తోంది.
జలమండలి పరిధిలోకి...
శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్నాయి. దీంతో వాటిని కూడా జలమండలి (Jalamandali) పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!
ఓఆర్‌ఆర్ పరిధిలో..
ఇప్పటికే ఓటర్ రింగ్‌రోడ్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరా కోసం ఓఆర్‌ఆర్ తాగునీటి ప్రాజెక్టు–1, 2 దశలను పూర్తి చేసి సేవలందిస్తోంది. ఓఆర్‌ఆర్–1 కింద జీహెచ్‌ఎంసీ పరిధి అవతల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయంతో 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల 164 రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు దాదాపు రూ.527 కోట్ల వ్యయంతో 1,601 కిలో మీటర్ల మేర పైపులైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది. ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు–2 కింద సుమారు 189 కోట్ల అంచనా వ్యయంతో 140 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన 71 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం, సుమారు రూ.778 కోట్ల అంచనా వ్యయంతో 2,758 కిలోమీటర్ల మేర కొత్త పైపులైను నెట్‌వర్క్ పూర్తి చేసి సేవలు అందిస్తోంది.