
కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో నో పెట్రోల్, నో డీజిల్
కాలపరిమితి ముగిసినా హైదరాబాద్‌లో యధేచ్ఛగా పరుగులు
గ్రేటర్‌లో 15 ఏళ్లు దాటిన వాహనాలు సుమారు 25 లక్షలు
స్వచ్ఛంద స్క్రాపింగ్‌కు స్పందన కరవు
డొక్కుబండ్లతో ఠారెత్తిస్తున్న కాలుష్యకారకాలు
సాక్షి, సిటీబ్యూరో: కాలం చెల్లిన వాహనాలపై ఢిల్కీ సర్కార్ కొరడా ఝళిపించింది. కాలపరిమితి ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేస్తూ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం లక్షలాది కాలం చెల్లిన వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారకాలతో రహదారులపై స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజారోగ్యంపై కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి.నగరంలో ప్రవేశపెట్టిన 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛంద తుక్కు విధానం ఆచరణలో వెక్కిరిస్తోంది.
పాతవాహనాన్ని స్క్రాప్ చేసుకొని కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవాళ్లకు జీవితకాలపన్నులో రవాణాశాఖ కొంత మొత్తాన్ని మినహాయింపునిస్తున్నా వాహనదారుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కాలపరిమితి ముగిసిన డొక్కుబండ్ల వినియోగాన్ని అరికట్టేందుకు ఢిల్లీ తరహాలో నిర్బంధ విధానాలను అమలు చేయాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని రూపొందించింది.
కానీ దీన్ని నగరంలో స్వచ్ఛందం చేయడం వల్ల చాలామంది ముందుకు రావడం లేదు. నగరంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలు సుమారు 85 లక్షలకు పైగా ఉన్నాయి. రవాణాశాఖ అంచనాల ప్రకారమే 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాలు కనీసం 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మరోవైపు ప్రతిసంవత్సరం ఈ డొక్కు బండ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాలుష్యకారక వాహనాల వల్ల జీవశైలి వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి.
వ్యక్తిగత వాహనాలే టాప్...
నగరంలో 15 ఏళ్లు దాటిన వాటిలో వ్యక్తిగత వాహనాల కేటగిరీలో సుమారు 17 లక్షల బైక్‌లు, మరో 3.5 లక్షల కార్లు టాప్‌లో ఉన్నాయి. రవాణా వాహనాల కేటగిరీలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, తదితర వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. మరో లక్ష వరకు సరుకు రవాణా వాహనాలు ఉన్నట్లు అంచనా. గ్రేటర్‌లో 13 వేలకు పైగా స్కూల్ వాహనాలు ఉంటే వాటిలో 2500 వరకు డొక్కు బస్సులే కావడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో లభించే వాహనాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సుమారు 1.4 లక్షల ఆటోరిక్షాల్లో కనీసం 25 వేలకు పైగా కాలం చెల్లినవి ఉన్నాయి. ఇవి కాకుండా వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు, 4 వేల మ్యాక్సీ క్యాబ్‌లు తిరుగుతున్నాయి. ఇలా ఇటు వ్యక్తిగత వాహనాలు, అటు రవాణా వాహనాలు అన్నీ కలిపి 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో పీఎం స్థాయి 2.5 శాతం వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల కండీషన్ బాగా లేకపోవడం వల్ల, ఇంజన్ దెబ్బతినడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఉత్తుత్తి తుక్కు విధానం...
మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో 5ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు సైతం రిజి్రస్టేషన్ పునరుద్ధరణ సదుపాయం ఉంది.
ఈ వెసులుబాటు వల్ల స్వచ్ఛంద స్క్రాపింగ్‌కు స్పందన రావడం లేదు. వాహనాల స్క్రాపింగ్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ప్రభుత్వ విభాగాలకు చెందిన రవాణా వాహనాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించినవి మినహాయించి వ్యక్తిగత వాహనదారులు స్వచ్చంద స్క్రాపింగ్‌కు ముందుకు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఢిల్లీలో ఇలా..
ఢిల్లీ రవాణాశాఖ లెక్కల ప్రకారం 15 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటికి జూలై ఒకటో తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ నిషేధించారు.ఈ మేరకు 350 పెట్రోల్ బంకుల్లో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్‌ప్లేట్‌లను ‘క్లిక్’ మనిపించి రవాణా కార్యాలయానికి చేరవేస్తాయి. అక్కడి ఆరీ్టఏలో ఏర్పాటు చేసిన కమాండ్ కేంద్రంలో వాహనం జీవితకాలాన్ని నిర్ధారిస్తారు. ఇదంతా కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసిన బంకుల్లో కొన్నింటి నిర్వహణను పోలీసులు పర్యవేక్షించనుండగా, మరికొన్ని రవాణాశాఖ పర్యవేక్షించనుంది. ఈ విధానంపైన పెట్రోల్ బంకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ఢిల్లీలో ప్రమాదకరంగా ఉన్న వాహనకాలుష్యం దృష్ట్యా ఈ విధానం మంచిదేనని పర్యావరణవర్గాలు పేర్కొంటున్నాయి.