పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి
స్పీకర్ నోటీసులకు 8 మంది సమాధానం.. స్పందించని దానం, కడియం... గడువులోగా స్పీకర్ విచారణ చేపట్టకపోవడంపై మళ్లీ సుప్రీంకు బీఆర్‌ఎస్
రేపు జరగనున్న విచారణ.. దానం, కడియంపై వేటుపడితే మళ్లీ ఉప ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా ఇద్దరు ఎమ్మెల్యేలు నేటికీ స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై రెండు విడతల్లో సాగిన స్పీకర్ విచారణ శనివారం పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఇటీవల మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని విచారణ గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టును కోరినట్లు సమాచారం. కాగా, స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్)పై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య 10 మంది ఎమ్మెల్యేలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్) కాంగ్రెస్‌లో చేరినట్లు బీఆర్‌ఎస్ ఆరోపించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్‌ఎస్ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు.
రెండు విడతల్లో స్పీకర్ విచారణ
ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడత విచారణలో భాగంగా సెపె్టంబర్, అక్టోబర్‌లలో ఐదు రోజులపాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ట్రిబ్యునల్ విచారించింది. అయితే తాము పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని వారు వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టు విధించిన గడువులోగా నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తవగా పిటిషన్ల విస్తృతిని దృష్టిలో పెట్టుకొని మరో 8 వారాల గడువు కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.
ఈలోగా రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో మొత్తం 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.


