
18 రోజుల విదేశీ పర్యటన నుంచి నేడు నగరానికి స్పీకర్ బృందం
రేపు స్పీకర్ ఎదుట ఆ నలుగురిపై బీఆర్‌ఎస్ వాదనలు
ఈ నెల 30న ముగియనున్న సుప్రీంకోర్టు గడువు
విచారణ గడువు పొడిగించాలని కోర్టును కోరనున్న స్పీకర్?
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. బార్బడోస్, ఫ్రాన్స్, లండన్, ఇటలీలో స్పీకర్‌తోపాటు మండలి చైర్మన్, వైస్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శితో కూడిన ప్రతినిధి బృందం 18 రోజుల పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకుంటోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ నెల 4 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మరో నలుగురి విచారణకు షెడ్యూల్?
పది మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా నలుగురికి సంబంధించిన విచారణ షెడ్యూల్‌ను మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగు రు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్‌ఎస్ ఇచ్చిన పిటిషన్లపై నెలాఖరులోగా స్పీకర్ విచారణ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువులోగా విచారణ పక్రియ ముగిసే అవకాశం కనిపించడం లేదు.
మరోవైపు స్పీకర్ నోటీసు లు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తమ వివరణ ఇచ్చి ఉంటే సంబంధిత కాపీలు తమకు అంది ఉండేవని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కోరాలనే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం.