తెలంగాణ సీపీఆర్వోనని ఐడీ కార్డు చూపినా అనుమతించని భద్రతా సిబ్బంది
వెనుతిరుగుతుండగా అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసుల యత్నం
కన్నీటిపర్యంతమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన హర్ష భార్గవి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు.
కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.
అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు.


