రెండు రోజులుగా అంబులెన్స్‌లోనే మృతదేహం 

Body is in ambulance from last two days - Sakshi

ఎల్‌ అండ్‌ టీ కార్మికుడిగా గుర్తింపు

హైదరాబాద్‌: పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని 2 రోజులుగా అంబులెన్స్‌లోనే ఉంచిన ఘటన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన దుర్వాసన వెలువడటంతో అంబులెన్స్‌లో మృతదేహం ఉన్నట్లు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది, అవుట్‌పోస్టు పోలీసులు శనివారం గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంగర ముండా (36) 2నెలల క్రితం ఎల్‌అండ్‌టీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిన హెల్పర్‌గా చేరాడు. ఉప్పల్‌ విజయపురి సమీపంలోని ఎల్‌అండ్‌టీ లేబర్‌ కాలనీలో ఉంటున్నాడు. ఈ నెల 20న కాలనీ సమీపంలోని గడ్డిపొలాల్లో శవమై కనిపించాడు. మెడకు టవల్‌ చుట్టి హత్య చేసినట్లు పోలీసులు భావించారు.

మంగర మృతదేహానికి శుక్రవారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించాక బంధువులకు అప్పగించారు. అదే రోజు మీనా ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ (ఏపీ05 డబ్ల్యూ 1948)లో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఏమైందో తెలియదు కానీ మృతదేహంతోపాటు సదరు అంబులెన్స్‌ గాంధీ మార్చురీ సమీపంలోనే పార్కింగ్‌ చేసి ఉంది. రోగి సహాయకుల ఫిర్యాదు మేరకు మృతదేహంతో ఉన్న అంబులెన్స్‌ను పోలీసులు గుర్తించారు. ఎల్‌అండ్‌టీ యాజమాన్యంతోపాటు ఉప్పల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని తరలించినట్లు ఆస్పత్రి యంత్రాంగం తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top