కొలువుదీరేదెన్నడు?


పరోక్ష ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన

 - నీరసిస్తున్న ఆశావహులు  

 - మారుతున్న సమీకరణలు

 - అభ్యర్థులకు చుక్కలు చూపుతున్న జంప్‌జిలానీలు


 కరీంనగర్ సిటీ: ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని అయోమయ పరిస్థితి పరోక్ష ఎన్నికల విషయంలో నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నలభై రోజులు దాటుతున్నా ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికపై స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, అసెంబ్లీ సమావేశాలు.. నెపం ఏదైనా చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, కనీసం ఆ దిశగా కసరత్తు చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి తలెకొంది.



ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని ఎన్నికకు ఉత్సాహంతో క్యాంప్‌లు వేసిన ఆశావాహులు ప్రస్తుత పరిస్థితితో బేజారెత్తిపోతున్నారు. క్యాంపుల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుంటే కండ్లు తేలేసి.. మళ్లీ వేద్దాంలే అంటూ నుంచి ఇంటిబాట పడుతున్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థులు గాలం వేయడంతో సభ్యులు కప్పదాట్లకూసై అంటున్నారు.

 

నలభై రోజులు దాటినా ఊసేది?

మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. మే 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి 40 రోజులు దాటుతున్నా  జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల ఎన్నికలపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి విచిత్ర పరిస్థితి ప్రజాప్రతినిధులకు ఎదురవలేదు.



గతంలో కౌంటింగ్ కేంద్రాల నుంచే విజేతలను క్యాంపులకు తరలించేవాళ్లు. వారం రోజుల్లోపు చైర్మన్ ఎన్నిక తేలిపోయేది. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రజాప్రతినిధులకు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకపోవడం ఇబ్బందిగా మారింది. చైర్మన్  ఎన్నికలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా కీలకమవుతుండటంతో శాసనసభ కొలువు తీరాక, ప్రమాణస్వీకారం చేసిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.



తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు పూర్తయినా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికల సంఘం విభజన కాకపోవడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతుండటంతో అవి పూర్తయ్యాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.



కలవరపెడుతున్న జంప్‌జిలానీలు

 నానాతంటాలు పడి మద్దతుకు హామీ తీసుకొని క్యాంపులకు తీసుకెళ్తే ఎన్నిక నిర్వహించకపోవడంతో సభ్యుల మనసు మారకుండా చూడటం చైర్మన్ అభ్యర్థులకు మరో పరీక్షగా మారింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తుండటంతో రాజకీయ సమీకరణలు తారుమారవుతున్నాయి. జిల్లాలో 57 మండలాలకు 29 స్థానాల్లో టీఆర్‌ఎస్, 11 మండలాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాగా, 17 మండలాల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల్లో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్‌ఎస్ మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ పార్టీ సైతం చాపకిందనీరులా తమ ప్రయత్నాలు సాగిస్తోంది.



పెద్దపల్లి నగరపంచాయతీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది. క్యాంపు రాజకీయాలంటేనే కప్పదాట్లకు నిలయం. ఒక పార్టీ క్యాంపులో ఉన్నా, మరో పార్టీ ఆశావాహులు వారితో టచ్ లో ఉంటూ తమవైపు జంప్ చేసేలా ‘మాట్లాడుకుంటున్నారు’. ఇందుకు తగినట్లుగానే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాంపు నుంచి వచ్చి మరో క్యాంపునకు వెళ్లగా, మరికొంతమంది ఎన్నికల నాటికి పార్టీ మారుస్తామని ఒట్టేస్తున్నారు. కమాన్‌పూర్‌లో కాంగ్రెస్ క్యాంపు నిర్వహించి తిరిగి రాగా, టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎనిమిది మంది ఎంపీటీసీలు క్యాంపు మార్చారు. కాంగ్రెస్ క్యాంపు నుంచి వచ్చి తిరిగి టీఆర్‌ఎస్ క్యాంపులో చేరడంతో ఎంపీపీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

 

ముగింపు ఎప్పుడో...?

 పరోక్ష ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు ఎప్పుడనేది ప్రజాప్రతినిధుల మదిని తొలుస్తోంది. ఇప్పుడు...అప్పుడు అంటూ ప్రచారం జరగడం, ఆశావాహులు, పార్టీ నేతలు హడావుడి పడటం, ఆ తరువాత ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు పూర్తయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని పార్టీలన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో మళ్లీ క్యాంపులపై నేతలు దృష్టిసారిస్తున్నారు. మొత్తానికి పరోక్ష ఎన్నిక ఆశావాహుల్లో గుబులు పుట్టస్తుంటే, ఏదైనా జరగకపోతుందా అనే కోణంలో ప్రత్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top