నిలచిన కేబుల్‌ ప్రసారాలు | blackout of all TV channels Trai tariff order | Sakshi
Sakshi News home page

నిలచిన కేబుల్‌ ప్రసారాలు

Dec 30 2018 3:04 AM | Updated on Dec 30 2018 3:10 AM

blackout of all TV channels Trai tariff order  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేబుల్‌ ప్రసారాలపై తాజాగా ట్రాయ్‌ విధించిన నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో శనివారం హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రసారాలను నిలిపేసి ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ, ఏపీ ఎంఎస్‌ఒ, కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిపి తమ నిరసనతో పాటు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఒ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిశోర్, కేబుల్‌ టీవీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జితేంద్రలు మాట్లాడుతూ పే చానల్స్‌ను గతంలో ఉన్న ధరకే ఇవ్వాలని, గరిష్ట ధరను రుద్దవద్దని, జీఎస్‌టీని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

గడువు, సమాచారం ఇవ్వకుండా ట్రాయ్‌ రెండో విడతగా పే చానల్స్‌ను కనిష్టంగా రూ.1 నుంచి 19 వరకు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. గతంలో రూ.1 ఉన్న చానల్స్‌ కూడా ప్రస్తుతం రూ. 19 గా ప్రకటించడంతో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందన్నారు. ఇలా ఒక్కో చానల్‌కు రూ.19 వంతున చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న కేబుల్‌ చార్జీలు 200 నుంచి 800 దాటే అవకాశం ఉందన్నారు. ఇలా రేట్లు పెంచితే వినియోగదారులు తమను నిలదీయడమే కాకుండా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్‌టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తున్నాయని     దాన్ని పూర్తిగా ఎత్తేయాలని కిశోర్, జితేంద్రలు డిమాండ్‌ చేశారు.

 బ్లాకవుట్‌ ఎప్పుడూ లేదు.. 
కేబుల్‌ చరిత్రలో బ్లాకవుట్‌ ఎప్పుడూ జరగలేదని, కేబుల్‌ రంగంలో ఇంతపెద్ద సమస్య ఎప్పుడూ రాలేదన్నారు. 2012లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటంతో కేబుల్‌ ఆపరేటర్లు రూ.లక్షలు వెచ్చించి సెటప్‌ బాక్సులు పెట్టారన్నారు. 2015 కన్నా ముందు రూ.3 నుంచి 5 ఒక్కొ పే చానల్‌ ధర ఉండగా ప్రస్తుతం ట్రాయ్‌ ఒక్కసారిగా పెంచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే అదనుగా ప్రతీ బ్రాడ్‌కాస్టర్‌ గతంలో తక్కువ ధర ఉన్న తమ చానల్‌ రేటును రూ.19కి పెంచి ఆ రేటుకే ఇస్తామని చెపుతున్నారన్నారు. ట్రాయ్‌ కొత్త టారిఫ్‌ను నియంత్రించాలని గతంలో ఉన్న టారిఫ్‌కే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటీషన్‌ వేశామన్నారు. పే చానల్స్‌ ఏవో, ఫ్రీ చానల్స్‌ ఏవో వినియోగదారులకు తెలియకుండా తాము రూ.200 వసూలు చేసి అన్ని చానల్స్‌ ప్రసారం చేశామన్నారు. ఇలా చూపడంద్వారానే బ్రాడ్‌కాస్టర్లకు రేటింగులు పెరిగాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. కేబుల్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు హరిగౌడ్, గ్రేటర్‌ గౌరవాధ్యక్షుడు జి. భాస్కర్‌ రావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పి.రాంబాబు, సునీల్, సురేందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement