
ఎక్కడికక్కడ కేబుల్ వైర్లు తొలగిస్తున్న విద్యుత్ సిబ్బంది
ఆపరేటర్ల మొరతో కొంతసడలింపు ఇచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు వేసిన కేబుల్ వైర్ల వల్ల హైదరాబాద్‌లో విద్యుత్ షాక్ తగిలి పలువురు ప్రాణాలు పో గొట్టుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కరెంట్ పోల్స్‌కు ఉన్న తీగలన్నీ తీసివేయాలని ఆదేశించింది. కొన్ని నెలలుగా నోటీసులిస్తున్నా పట్టించుకోని ఆపరేటర్లపై చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.
కేబుల్ వైర్లను తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. దీంతో చాలాచోట్ల ఇంటర్‌నెట్ ఆగిపోయింది. ఆన్‌లైన్ ఆధారిత కార్యక్రమాలు నిలిచిపోయాయి. మీ–సేవ, ఈ–సేవ, రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు తిప్పలు పడ్డారు. అటు వర్క్‌ఫ్రంహోం చేస్తున్న ఉద్యోగులు ,సర్విస్ అందించే టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
అధికారుల దృష్టికి సమస్య..
కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ ఉన్నతాధికారులను బుధవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఒక్కసారిగా నెట్ బంద్ కావడంతో తలెత్తిన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చారు. కొంతసమయం ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు పరిస్థితిని గుర్తించారు. విద్యుత్ స్తంభం 30 అడుగుల వరకూ ఉంటుంది. 15 అడుగుల వరకూ కేబుల్‌కు అనుమతిస్తూ, అంతకుపైన ఉన్న కేబుల్స్‌ను తొలగిస్తామని చెప్పారు. 15 అడుగులకిందకు ఉన్నా తొలగిస్తున్నారని, సిబ్బందికి చెప్పినా వినిపించుకోవడం లేదని ఆపరేటర్లు చెప్పారు. దీంతో అన్ని స్థాయిల అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్టు డిస్కమ్ సీఎండీలు తెలిపారు.