పోటీకి దూరంగా లక్ష్మణ్‌?  | The BJP is likely to announce the first list of candidates | Sakshi
Sakshi News home page

పోటీకి దూరంగా లక్ష్మణ్‌? 

Mar 16 2019 3:55 AM | Updated on Mar 29 2019 9:13 PM

The BJP is likely to announce the first list of candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించే అవకాశముంది. శుక్రవారమే ఈ జాబితాను ప్రకటించాలని భావించినా జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ నెల 16కి వాయిదా పడటంతో అభ్యర్థుల ప్రకటన కూడా ఆలస్యమైంది. శనివారం జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, శనివారం లేదా ఆదివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్‌ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, మంత్రి శ్రీనివాస్, రాంచంద్రరావు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లతో జాబితాను రూపొందించి తమ వెంట తీసుకువెళ్తున్నారు.
 
కొత్తవారికి చాన్స్‌.. 
ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా వారి పేర్లను కూడా జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఆ జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో నిలపాల్సిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన పార్టీ మొదట 10 స్థానాలకు, తర్వాత ఒకట్రెండు రోజులకు మిగతా స్థానా లకు పోటీలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కూడా సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కూడా ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ తన పోటీ యోచనను విరమించుకున్నట్లు తెలిసింది. దానిపైనా శనివారం స్పష్టత రానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కనుక పోటీ చేయాలని ఆదేశిస్తే లక్ష్మణ్‌ సికింద్రాబాద్‌ స్థానం నుంచి పోటీలో నిలిచే అవకాశముంది. 

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు..
సికింద్రాబాద్‌: కిషన్‌రెడ్డి/బండారు దత్తాత్రేయ/లక్ష్మణ్‌ 
నాగర్‌కర్నూల్‌: బంగారు శ్రుతి 
మహబూబ్‌నగర్‌: శాంతకుమార్‌/కొత్తవారికి అవకాశం 
చేవెళ్ల: జనార్దన్‌రెడ్డి/యోగానంద్‌ 
జహీరాబాద్‌: సోమాయప్ప 
నిజామాబాద్‌: ధర్మపురి అరవింద్‌/సదానందరెడ్డి 
కరీంనగర్‌: దుగ్యాల ప్రదీప్‌రావు/బండి సంజయ్‌/రామకృష్ణారెడ్డి 
పెద్దపల్లి: కాసిపేట లింగయ్య/ఎస్‌.కుమార్‌ 
ఆదిలాబాద్‌: రేష్మారాథోడ్‌/కొత్తవారికి అవకాశం 
వరంగల్‌: చింతా సాంబమూర్తి /బాబుమోహన్‌ 
మహబూబాబాద్‌: హుస్సేన్‌ నాయక్‌/చందా లింగయ్య దొర 
భువనగిరి: డాక్టర్‌ అనిల్‌/శ్యాంసుందర్‌ 
నల్లగొండ: శ్రీధర్‌/గోలి మధుసూదన్‌రెడ్డి 
హైదరాబాద్‌: అమర్‌సింగ్‌ 
మల్కాజిగిరి: రాంచంద్రరావు/ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌/మల్లారెడ్డి 
మెదక్‌: రఘునందన్‌రావు/రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే/కరుణాకర్‌రెడ్డి 
ఖమ్మం: వాసుదేవ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement