
ముత్తూట్ దొంగలు వీరే!
బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర ముఠా వేసిన ‘స్కెచ్’ చూసి అధికారులు విస్తుపోయారు.
► ఎవరి ‘పాత్ర’ ఏమిటనేది నిర్ధారించిన పోలీసులు
► అరెస్టైన వారి విచారణలో కీలక విషయాలు వెల్లడి
► ప్రధాన నిందితుడు సుందర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు
► 38 కిలోల బంగారం అతడి వద్దే ఉన్నట్లు అనుమానం
సాక్షి, హైదరాబాద్: బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర ముఠా వేసిన ‘స్కెచ్’ చూసి అధికారులు విస్తుపోయారు. సీబీఐ అధికారి, ట్రాఫిక్ కానిస్టేబుల్, దొంగ, సఫారీ సూట్ వేసుకున్న ధనికుడు, మిలటరీ క్యాప్‌తో మరొకరు.. ఇలా ముఠాలోని ఒక్కో సభ్యుడు ఒక్కో అవతారంలో కార్యాలయంలోకి ప్రవే శించి, సినీ ఫక్కీలో దాదాపు 42 కిలోల బం గారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. వారిలో ముగ్గురిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.. ఎవరి ‘పాత్ర’ ఏమిటనేది నిర్ధా రించారు. ఈ ముఠాలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన సుందర్ రాజారత్నం కనగల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. దాదాపు 38 కిలోల బంగారం అతని వద్దే ఉందని భావిస్తున్నారు.
రాజకీయాల్లోకి వెళ్లే యత్నం..?
ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీ సులు.. 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేయ గలిగారు. మిగతాదంతా పరారీలో ఉన్న సుం దర్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీ సులకు చిక్కిన ముఠా నాయకుడు లక్ష్మణ్, విజయ్‌కుమార్ (వాహనం సమకూర్చిన వ్యక్తి), సుభాష్ పుజారిలు సైతం విచారణలో ఇదే విషయం చెప్పినట్లు తెలిసింది. సుం దర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం దొరెపల్లి. అతడి తండ్రి రాజారత్నం రైల్వే ఉద్యోగి. వారి కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబైలోని ధారావి ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్‌కు సన్నిహితుడు. వచ్చే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో సుందర్‌తోపాటు కాలా అలియాస్ లంబు, తుకారాం గైక్వాడ్‌లు పరారీలో ఉన్నారు.
సెక్యూరిటీ లోపంతోనే టార్గెట్..
ఈ ముఠా సభ్యులు గతంలోనూ ముత్తూట్ సంస్థల్లో పంజా విసిరారు. ముత్తూట్ బ్రాంచీ ల్లో బంగారం ఎక్కువగా ఉండడం, సెక్యూ రిటీ తక్కువగా ఉండడం వల్లే వాటిని టార్గెట్ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడిం చారు. మరోవైపు కొన్ని అంతర్రాష్ట్ర ఫైనాన్స్ సంస్థల్లో కేంద్రీకృత సీసీ కెమెరా వ్యవస్థ ఉం టుంది. వాటిలో ఏ బ్రాంచిలో ఏం జరుగు తోందనేది కేంద్ర కార్యాలయంలో ఉన్నవారు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ముత్తూట్ సంస్థల్లో కేవలం ఆ కార్యాలయానికి సంబంధించి మాత్రమే సీసీ కెమెరా వ్యవస్థ పనిచేస్తుంది. దోపిడీ కోసం ఇదే సంస్థల్ని టార్గెట్ చేయడా నికి ఇదీ ఓ కారణమని పోలీసులు చెప్తున్నారు.
వాహనాల నంబర్లు మార్చేసిన సుభాష్
దొంగతనం చేసిన వాహనాలు కొనుగోలు చేసే సుభాష్ 2007 మోడల్‌కు చెందిన స్కార్పియోను తక్కువ ధరకు కొన్నాడు. దాని ఛాసిస్ నంబర్లు, ఇంజన్ నంబర్‌ను తొలగిం చాడు. తర్వాత ఎంహెచ్06 ఏఎన్ 1174 నంబర్ (మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ )తో నకిలీ నం బర్ ప్లేట్ తయారుచేయడంతో పాటు ఆర్‌సీ, కారుకు సంబంధించిన ఇతర నకిలీ పత్రాల నూ సిద్ధం చేశాడు. పోలీసులు ఏ సమయం లోనూ ఛాసిస్ నంబర్లు తనిఖీ చేయరాని తెలిసి ఇలా వ్యవహరించినట్టు తెలిసింది.
గుజరాత్‌లో రోషణ్ కోసం గాలింపు
ఇక పరారీలో ఉన్న రోషణ్ యాదవ్ గుజరాత్ లో ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గుజరాత్‌లోని మెహసానా వద్ద రూ.15 కోట్ల హవాలా డబ్బులు కాజేయాలన్నదే ఈ గ్యాంగ్ తర్వాత ప్లాన్ గా ఉందని పోలీసులు చెబుతున్నారు.
పాటిల్.. యమ స్పీడున్న డ్రైవర్
గణేశ్ పాండురంగ భోంస్లే అలియాస్ పాటిల్ స్టీరింగ్ పట్టుకుంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లా ల్సిందే. ఎక్కడా విరామం తీసుకోకుం డా వాహనాన్ని వెయ్యి కిలోమీటర్ల వరకు అలవోకగా నడిపేస్తాడు. అందుకే బీరంగూడలో దోపిడీ చేసిన సొత్తును తీసుకెళ్లిన నల్ల రంగు స్కార్పియోకు పాటిలే డ్రైవర్‌గా వ్యవహరించాడు. బీరంగూడ నుంచి కర్ణాటకలోని హలీకట్ట వరకు కేవలం రెండున్నర గంట ల్లోనే కారును తీసుకెళ్లాడంటే ఎంత వేగంగా నడిపాడో తెలిసి పోతుంది. అదే దూరాన్ని తాము చేరుకునేందుకు దాదాపు నాలుగు గంటలకుపైగా పట్టిందని పోలీసులే చెబుతున్నారు.
ఎవరి ‘పాత్రలు’ ఏమిటంటే..?
లక్ష్మణ్ నారాయణ్ మధుంగ్ అలియాస్ భయ్యా
ముఠాకు నాయకుడు. ముత్తూట్ ఫైనాన్స్ లోకి సర్దార్‌జీ వేషంలో సీబీఐ అధికారిగా ప్రవేశించాడు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఓ ఐడీ కార్డు సైతం చూపించాడు. తుపాకీ చూపించి సిబ్బందిని బెదిరించింది కూడా ఇతడే.
గణేశ్ పాండురంగ భోంస్లే అలియాస్ పాటిల్
ఇతడిపై రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ కేసులున్నాయి. దోపిడీ కోసం ముత్తూట్ ఫైనాన్స్ లోకి ప్రవేశించినప్పుడు లేత బూడిదరంగు సఫారీ డ్రస్ వేసుకుని అధికారిగా చెప్పుకున్నాడు. చేతిలో తుపాకీ తో పాటు బేడీలు పట్టుకుని వచ్చాడు.
సుభాష్ పుజారీ పాండే
ముఠా సభ్యులు ‘దొంగ’గా చెబుతూ తీసుకువచ్చింది ఇతడినే. ఆ సమయంలో నల్లని మాస్క్, మంకీ క్యాప్ ధరించి వచ్చాడు. ఇతడి నేరానికి సంబంధించిన ‘వెరిఫికేషన్’ కోసమే వచ్చామంటూ ‘సీబీఐ అధికారి’ ముత్తూట్ సిబ్బందికి చెప్పాడు. బంగారం మూటకట్టడంలో సహకరించాడు.
కాలా అలియాస్ లంబు
తమిళనాడుకు చెందిన ఇతను ముంబైలో స్థిరపడ్డాడు. పరారీలో ఉండటంతో పూర్తి వివరాలు సరిచూడాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తెల్లటి షర్ట్‌ను టక్ చేసుకుని, జంగిల్ క్యాప్‌తో వచ్చాడు. అల్మారా వెత కడంతోపాటు బంగారం మూటకట్టాడు.
తుకారాం గైక్వాడ్
నేరచరితుడైన తుకారాం ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన వాడు. ముత్తూట్‌లోకి ప్రవేశించిన సమయంలో తెల్ల షర్టు, డార్క్ కలర్ ప్యాంట్‌తో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేషంలో ఉన్నాడు.