ఒక్క వృక్షం ఉంటే ఒట్టు !

ఒక్క వృక్షం ఉంటే ఒట్టు ! - Sakshi


భువనగిరి జాతీయ రహదారి విస్తరణతో పచ్చదనం కోల్పోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు పూర్తయ్యాయి.  అయితే నాలుగులేన్ల రోడ్డు విస్తరణకు ముందున్న రెండు వరుసల రోడ్డు పక్కన గల భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. అప్పట్లో ప్రజలు చెట్లను నరకవద్దని అడ్డుకోగా నూతన  సాంకేతిక విధానం ద్వారా చెట్లను నూతన రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో చె ట్లు నరకడానికి అనుమతిని ఇచ్చారు. కానీ రోడ్డు పూర్తి చేయడానికి అధికారులు చెట్లు నరకడంలో చూపిన శ్రద్ధ వాటిని పెంచే విషయంలో చూపలేదు. ఫలితంగా జాతీయ రహదారికి ఇరువైపులా కనీసం నిలువ నీడలేని పరిస్థితి నెలకొంది.



రాయగిరి నుంచి రంగారె డ్డిజిల్లా సంస్కృతి టౌన్ షిప్ వరకు 38 కిలోమీటర్ల దూరం ఒక్క నీడనిచ్చే చెట్టు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతోంది. 46 డిగ్రీల ఎండ వేడిమిలో ద్విచక్రవాహనాలు, ఇతర  వాహనాల్లో ప్రయాణించే వారికి కనీసం నీడలేదు. తీవ్రమైన ఎండలో వడగాలిని తట్టుకుని ప్రయాణించే వారు కొద్ది సేపు ఆగి సేదదీరడానికి చెట్లు లేకపోవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, ఆనారోగ్యంతో  బాధపడే వారికి రోడ్డుపై మధ్యాహ్నం ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. వాహనాల ఇంజన్ల వేడి అయితే కొద్దిసేపు విరామం కోసం నిలిచిఉందామన్నా ఎక్కడా నీడలేదు.



రోడ్డు పక్కన చెట్లు పెంచాలి

 జాతీయ రహదారి పక్కన చెట్లు పెంచాలి. ఒకప్పుడు ఈ రోడ్డు వెంట పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. రోడ్డు విస్తరణ పేరుతో వాటిని తొలగించారు.ప్రస్తుతం ప్రయాణికులకు నిలువ నీడలేకుండా పోయింది. భువనగిరి నుంచి అన్నోజీగూడ వరకు ఒక్క చెట్టు లేదు. ఎండపూట ప్రయాణించే వారు నీడ కోసం అల్లాడిపోతున్నారు. జాతీయరహదారి అధికారులు చెట్ల పెంపకానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.

- మహమూద్, డ్రైవర్,  భువనగిరి



ఎండిపోయిన మొక్కలు

జాతీయ రహదారి విస్తరణ తరువాత రోడ్డు పక్కన  రోడ్డు నిర్వహణ సంస్థవారు నాటిన మొక్కలు సరైన ఆలనా పాలనా లేక ఎండిపోతున్నాయి. వేసవి ఎండలకు తోడు మొక్కలకు నీరు పోయకపోవడంతో రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణచేపట్టిన నిర్మాణ సంస్థలు మొక్కలు పెంచాలి. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి మొక్కల ఆలనాపాలన చూడాలి. అయితే  ఈ పరిస్థితి కన్పించడం లేదు. భువనగిరి, రాయగిరి, అనంతారం, బీబీనగర్ ప్రాంతాల్లో డివైడర్ల మధ్యన గల పూల మొక్కలు ఎండిపోయేస్థితికి చేరాయి.



పెద్ద చెట్లను నరికేశారు

విస్తరణకు ముందు రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద  వృక్షాలు ఉండేవి. వాటిలో చింత, మామిడి, తుమ్మ, వేప, అల్లనేరేడు వంటి చెట్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. రోడ్డును వెడల్పు చేస్తామని చెప్పి పెద్ద వృక్షాలను అడ్డంగా నరికేశారు. ఈ నేపథ్యంలో వందల సంవత్సరాల సంపదను నాశనం చేయవద్దని కొందరు అడ్డగించడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నరికిన వృక్షాలను రసాయనాల ద్వారా రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చెట్ల మొదళ్లలో రసాయనాలు పూసి కొంతకాలం వాటిని పక్కన ఉంచి అనంతరం వాటికి తిరిగి ప్రాణఃపతిష్ట చేస్తామని చెప్పారు. ఇందుకోసంప్రత్యేక లేపనాలు వచ్చాయని చెప్పారు. తీరా రోడ్డు పూర్తయ్యేసరికి లక్షల రూపాయల విలువ చేసే చెట్లు కనుమరుగై పోయాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top