నిమ్స్‌లో త్వరలో ఐపీ సేవలు

BB Nager Nims IP Services MP Boora Narsaiah Goud - Sakshi

బీబీనగర్‌(భువనగిరి) : బీబీనగర్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌ (ఐపీ) విభాగాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ వెల్లడించారు. గురువారం నిమ్స్‌ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిమ్స్‌ భవనంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. జూన్‌లోపు నిర్మాణ పనులు పూర్తవుతాయని, తదుపరి మొదటి దశలో 13 విభాగాలతో, 250 పడకలతో ఇన్‌ పేషెంట్‌ విభాగాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

రెండో దశలో 700లకుపైగా పడకలతో ఇతర విభాగాలతో కూడిన పూర్తిస్థాయి ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు వివరించారు. మొదటి దశలో కావాల్సిన సదుపాయాలు, అవరమయ్యే నిధులపై ప్లాన్‌ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిపారు. అంతకుముందు నిమ్స్‌ భవనంలో పూర్తయిన పనులు, పరిసర ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాలతో షూట్‌ చేయించిన ఎంపీ వాటిని సీఎంకు చూపించనున్నట్లు  ఆయన తెలిపారు.

ఎయిమ్స్‌ ఏర్పాటుకు కృషి

బీబీనగర్‌లోనే ఎయిమ్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ నర్సయ్యగౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మొగ్గు చూపుతున్నారని, కేంద్రానికి అందజేయాల్సిన స్థల సేకరణ ప్రతిపాదనలను రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌ నుంచి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఏయిమ్స్‌ నిర్మాణానికి అనుకూలంగా ఉందని సీఏం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, నిమ్స్‌ సూపరింటెండెంట్‌ మహేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top