Sakshi News home page

ఆటో కార్మికుల ఆందోళన ఉద్రిక్తం

Published Mon, Jul 31 2017 1:31 AM

ఆటో కార్మికుల ఆందోళన ఉద్రిక్తం - Sakshi

యాదాద్రి కొండపైకి బస్సులు ఆపాలంటూ బైఠాయింపు
యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి బస్సులు నడపడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆటో కార్మిక సంఘం జేఏసీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు ఒంటిపై పెట్రోలు పోసుకోవడం.. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆదివారం యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ కొండపైకి రోజువారీ లాగానే బస్సులు నడుపుతోంది. వెంటనే ఆర్టీసీ మినీ బస్సులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం 11 గంటలకు కొండపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు కార్మికులను అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేయగా.. కార్మికులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు భక్తులు ఆటో కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను పక్కకు నెట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

పెట్రోల్‌ పోసుకుని నిరసన: ఆందోళన చేస్తున్న పలువురు కార్మికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, ఆర్టీసీ డీఎం, ఆలయ ఈఓ తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆటోకార్మికులపై పలు ప్రాంతాలకు చెందిన భక్తులు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement