మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ | atter flop in road safety weekly in RTC | Sakshi
Sakshi News home page

మొదటి రోజే అట్టర్ ఫ్లాప్

Jan 12 2015 9:33 AM | Updated on Aug 30 2018 5:35 PM

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ వారోత్సవాలు మొక్కుబడిగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభం అవుతాయని, 17 వరకు జరుగుతాయని  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసిన దానిని పెడచెవిన పెట్టారనేందుకు ఆదివారం ఖమ్మంలోని రవాణా శాఖ కార్యలయంలో ప్రారంభమైన భద్రతా వారోత్సవాల కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.

జన సమీకరణకు పాట్లు
ఆదివారం నుంచి భద్రత వారోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిసి కూడా రవాణా శాఖ అధికారులు తగిన ప్రచారం నిర్వహించలేదు. దీంతో ఈ కార్యక్రమానికి ఎవరూ రాలేదు. అసలు ఈ కార్యక్రమమున్న విషయం కనీసంగా డ్రైవర్లకుగానీ, ప్రజలకుగానీ తెలియలేదు. దీంతో ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం జనం లేకపోవటంతో మధ్యాహ్నం 2-30 తర్వాత ప్రారంభమైంది. కుర్చీలు నిండటం కోసం ఆటో డ్రైవర్లు, ఇతర డ్రైవర్లను, వాహన చోదకులను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ సిబ్బంది నానా పాట్లు పడ్డారు.
 
సిబ్బంది డుమ్మా
మొదటి రోజే భద్రతా వారోత్సవాల ప్రారంభం కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది డుమ్మా కొట్టడం పలువురిని విస్మయపరిచింది. ఆర్‌టీవో, సీనియర్‌ఎంవీఐ, ఏఎంవీఐ, సీనియర్ అసిస్టెంట్, హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరూ హాజరుకాలేదు.
 
కొరవడిన సమన్వయం
భద్రతా వారోత్సవాల సందర్భంగా రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం కొరవడింది. ఈ వారోత్సవాల విషయం తమకు తెలీదని, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కార్యక్రమానికి రావాలంటూ మెసేజ్ వేశారని, అందువల్లే తాము రాలేకపోయామని కొంతమంది సిబ్బంది చెప్పారు. జిల్లా ఉన్నతాధికారులు  అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించాల్సి వచ్చిందని, ఆదివారం కావటంతో డ్రైవర్లు, ప్రజలు అందుబాటులో లేరని, అందుకే అందరూ హాజరుకాలేకపోయారని రవాణాశాఖ అధికారులు చెప్పారు. జిల్లాలోని అన్ని రవాణా కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం పేలవంగా జరిగినట్టు సమాచారం.
 
భద్రత నినాదం కాదు.. జీవన విధానం
భద్రత అనేది నినాదం కాదు.. జీవన విధానమని ఆర్టీవో మొహిమిన్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే వారు రవాణా శాఖ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. కార్లు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐ రవీందర్, ఏఎంశీఐ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement