అసైన్డ్, పట్టాదారులు మధ్య తేడా ఎందుకు? | assigned people and passbook holders are same | Sakshi
Sakshi News home page

అసైన్డ్, పట్టాదారులు మధ్య తేడా ఎందుకు?

Nov 24 2016 2:36 AM | Updated on Aug 31 2018 8:31 PM

వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌దారులు, పట్టాదారుల మధ్య తేడా చూపుతుండటాన్ని రైతుల తరఫు న్యాయవాదులు బుధవారం హైకోర్టులో ప్రశ్నించారు.

⇒  హైకోర్టుకు రైతుల తరఫు న్యాయవాదుల నివేదన
తదుపరి విచారణ నేటికి వాయిదా  

 
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌దారులు, పట్టాదారుల మధ్య తేడా చూపుతుండటాన్ని రైతుల తరఫు న్యాయవాదులు బుధవారం హైకోర్టులో ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు సమానమేనని, పరిహారం చెల్లింపు విషయంలో వీరి మధ్య ఎటువంటి వివక్ష చూపడానికి వీల్లేదని వారు తెలిపారు. భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినట్లు చెబుతోందన్నారు. జీవో 123 కింద భూ సేకరణ చేపడుతుండటాన్ని సవాలు చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, మహబూబ్‌నగర్‌లో పట్టాదారులకు ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తుండగా, అసైన్‌‌డదారులకు రూ.3.5 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. పరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు ఒకటేనని గుర్తు చేసింది.

రైతుల తరఫు న్యాయవాదులు 2013 చట్ట ప్రకారం భూ సేకరణ ముందు సామాజిక, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వం సెక్షన్ 40 కింద అత్యవసర క్లాజు ద్వారా భూ సేకరణ జరుపుతోందన్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement