
సాక్షి, హైదరాబాద్: మహిళలు, బాలికలపై రోజు రోజుకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలు సభ్య సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో ప్రతీరోజు ఏదో ఒకమూల చోటు చేసుకుంటున్న అమానుష ఘటనలు, హత్యాచారాలు భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. తాజగా హైదరాబాద్‌లో ప్రియాంకరెడ్డి, వరంగల్‌లో మరో యువతి హత్యాచార ఘటనలు కలకలం రేపాయి.
అయితే అనుకోని ప్రమాదంలోగానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే.. అధైర్యపడకండి! ధైర్యంగా ఆలోచించండి.. అప్రమత్తంగా వుంటూ వేగంగా కదలండి. వీటిన్నికంటే ముందుగా పరిస్థితులను చురుకుగా అర్థం చేసుకోవడం ప్రధానం. దీంతోపాటు ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్ లైన్ నెంబర్లను తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోండి.
ప్రమాదంలో ఉన్న మహిళలూ, అమ్మాయిలు ఈ హెల్ప్‌లైన్లను గుర్తుంచుకోండి!
- విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 181 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబరు 040 - 2785 2355 గానీ, వాట్సాప్ నెంబరు 94906 16555 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి.
మరోవైపు తెలంగాణాలో చోటుచేసుకున్న వరుస ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తోందనీ, మీడియా హౌస్‌లు బాధితుల కోసం హెల్ప్‌లైన్ల అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. (ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్)
హైదరాబాదులో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు అమ్మాయిలు టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 181, 1091 లలో ఏదో ఒకదానికి ఫోన్ చేయండి. మీడియా మిత్రులు మరొకసారి హెల్ప్ లైన్లను ఫోకస్ చేయండి.
— Vasireddy Padma (@padma_vasireddy) November 28, 2019