మోసం చెయ్యం... మొత్తం ఇచ్చేస్తాం! 

Another petition filed in Nampally court on Nowhera - Sakshi

‘స్కీమ్‌ స్కామ్స్‌’పై నౌహీరా కొత్త వాదన 

నగదును 16 నెలల్లో 4 విడతల్లో చెల్లిస్తాం 

నాంపల్లి కోర్టులో తాజాగా మరో పిటిషన్‌ దాఖలు

ఆర్థిక వనరులు తెలపాలంటున్న సీసీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : వివిధ స్కీముల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడిన ‘హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌‘ఎండీ నౌహీరా షేక్‌ కొత్త పల్లవి అందుకున్నారు. తాము ఎవరినీ మోసం చేయలేదని, డిపాజిటర్లు కావాలంటే పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. ఆ మొత్తాలను 16 నెలల వ్యవధిలో 4 విడతల్లో చెల్లిస్తామని నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. నౌహీరాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న నగర నేర పరి«శోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు మాత్రం డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ఉన్న ఆర్థిక వనరుల వివరాలు తెలపాలని కోరుతున్నారు. మరోపక్క ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు కస్టడీలో ఉన్న నౌహీరాను ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌పై తీసుకురావడానికి సీసీఎస్‌ అధికారులు యత్నిస్తున్నారు. ఆమె కోసం అనేక రాష్ట్రాలు, నగరాలకు చెందిన పోలీసులు వేచి ఉన్నారని, వారి కస్టడీలు పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని ముంబై కోర్టు పోలీసులకు సూచించింది.  

ఆర్థిక మూలాల కోసం పోలీసుల వెతుకులాట 
హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కంపెనీకి చెందిన ఒక్కో తరహా స్కీమ్‌ తయారు చేసిన నౌహీరా తదితరులు అధిక వడ్డీలు ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారు. సాలీనా గరిష్టంగా 36 శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేక మంది పెట్టుబడులు పెట్టారు. కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు నౌహీరాను అరెస్టు చేశారు. ఈ కంపెనీకి చెందిన ఆర్థిక మూలాలు కనుక్కోవడంపై సీసీఎస్‌ పోలీసులు దృష్టి పెట్టారు. నౌహీరాతో పాటు అరెస్టయిన బిజూ థామస్, మోలీ థామస్‌లను విచారించినా వాటి ఆధారాలు లభించలేదు.

ఈ నేపథ్యంలోనే నౌహీరా షేక్‌ తన లాయర్‌ ద్వారా నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో ఓ పిటిషన్‌ వేయించారు. అందులో తమకు డిపాజిటర్లను మోసం చేసే ఉద్దే«శం లేదన్నారు. తమ వద్ద డబ్బు డిపాజిట్‌ చేసిన వారిలో ఎవరైనా తిరిగి చెల్లించాలని కోరితే... విత్‌డ్రా ఫామ్‌ ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వారి మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామని, 25 శాతం తొలి విడతలో 4 నెలల పాటు... రెండో విడతలోనూ మరో 25 శాతం ఇంకో 4 నెలల పాటు... ఇలా మొత్తం 16 నెలల్లో ఆ మొత్తం ఇచ్చేస్తామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తమపై కేసు నమోదైందని కోర్టుకు విన్నవించారు.  

ఎలా చెల్లిస్తారో చెప్పండి.. 
పిటిషన్‌ వివరాలు తెలుసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఆర్థిక మూలాలు చెప్పాలంటూ హీరా గ్రూప్‌ను కోరుతున్నారు. డిపాజిటర్లకు సొమ్ము ఏ మార్గంలో తిరిగి చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు విదేశీ ఖాతాల్లో నిధులు ఉన్నాయని హీరా గ్రూప్‌ చెప్తున్న నేపథ్యంలో వాటి వివరాలు కోరుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.220 కోట్లకు గాను 10 వేల విత్‌డ్రా ఫామ్స్‌ హీరా గ్రూప్‌ కార్యాలయం లో పడి ఉన్నాయని,అవి తమ సోదాల్లో లభించాయని సీసీఎస్‌ పోలీసులు చెప్తున్నారు. వాటిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నౌహీరాకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి విది తమే.అనంతరం ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

ఇప్పుడు నౌహీరాకు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్‌ కూడా పొందారు. దీన్ని తీసుకువెళ్లిన ఓ ప్రత్యేక బృందం ముంబై కోర్టులో దాఖలు చేసి నౌహీరాను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.నౌహీరా అరెస్టు తర్వాత ఆమెపై ముంబై, పుణేలతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వారంతా తమ కస్టడీల్లోకి తీసుకోవడానికి పీటీ వారంట్లతో ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో ఆయా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌ తీసుకువెళ్లాలంటూ ప్రత్యేక బృందానికి ముంబై కోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో సిటీ నుంచి వెళ్లిన టీమ్‌ తిరిగి వచ్చింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top