మస్త్‌ మజా.. మక్క వడ

Ankapur Famous For Corn Vada And Desi Chicken - Sakshi

అంకాపూర్‌లో మక్క వడల హోటళ్లకు భలే గిరాకీ

దేశీ చికెన్‌తో కలిపి తింటున్న భోజన ప్రియులు

సాక్షి, నిజామాబాద్‌: ‘అన్నా రోజు హోటళ్ల చాయి తాగుడేనా.. వర్షాకాలం షురూ అయింది అంకాపూర్‌కు పోయి నోరూరించే మక్క వడలు తిందాము నడు..’ అంటూ ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన యువతతో పాటు జిల్లావాసులు మక్కవడలు తినడానికి అంకాపూర్‌కు దారి పడుతున్నారు. నోరూరిస్తున్న మక్కవడలకు అంకాపూర్‌ దేశి చికెన్‌ తోడు కావడంతో భోజన ప్రియులు ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చుకొని మరీ మక్కవడలు, దేశీ చికెన్‌ తినడానికి ఇక్కడికి వస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో మొక్కజొన్న కంకుల (మక్కల) అమ్మకాలు జోరుందుకున్నాయి.

ఒకవైపు కొందరు వ్యవసాయ కూలీలు రోడ్లకు ఇరువైపులా షెడ్లు వేసుకొని మక్కెన్‌లను బొగ్గులపై కాలుస్తూ అమ్మకాలు సాగిస్తుండగా మరొకవైపు అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ హోటళ్లలో మక్క వడలను స్పెషల్‌గా వేసి ఇస్తున్నారు. దీంతో నోరూరించే మక్క వడలను తినడానికి ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. మక్కలలో పౌష్టికాహారాలు సైతం అధికంగా ఉండటంతో సీజనల్‌గా లభించే మక్కలను తింటే మంచిదని వైద్యులు సైతం పేర్కొంటుండటంతో ఈ మక్కవడల హోటళ్లు మూడు మక్కెన్‌లు, ఆరు వడలుగా కొనసాగుతున్నాయి.

అంకాపూర్‌ గ్రామానికి చెందిన మంజుల, సిద్దు, శివానంద్, మారుతి అనే హోటళ్ల యజమానులు భోజన ప్రియుల నాడిని పట్టుకొని మక్క వడలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. స్థానికంగా మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన మక్క పచ్చిబుట్టలను కొనుగోలు చేసి మక్కలను వలిచి అల్లంవెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ధనియాలపొడి, కరివేపాకు, పసుపు, ఉల్లిగడ్డ తదితరాలు వేసి గ్రైండర్‌లో పేస్ట్‌గా తయారు చేసి నూనెలో గోలించి నోరూరించే మక్కవడలను తయారు చేస్తున్నారు. 20 రూపాయలకు నాలుగు మక్కవడలను చిన్నగా కోసిన ఉల్లిగడ్డలు, నూనెలో గోలించిన మిరపకాయలతో నంజుకొని తినడానికి ఇస్తున్నారు. మరో హోటల్‌లో ప్రత్యేకంగా చట్నీని సైతం ఇస్తున్నారు.

దీంతో అంకాపూర్‌లో మక్కవడలకు ప్రత్యేకంగా డిమాండ్‌ ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సైతం వచ్చే వారే కాకుండా 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిజామాబాద్‌ వైపు వెల్లి వచ్చే ప్రయాణీకులు సైతం ఇక్కడ ప్రత్యేకంగా ఆగి మరీ మక్క వడలు తింటూ అంకాపూర్‌ వడల రుచిని అభినందిస్తున్నారు. మరో వైపు ఇక్కడ మక్క వడలు తిన్న వారు తమ కుటుంబ సభ్యుల కోసం పార్సిల్‌ను సైతం ఖచ్చితంగా తీసుకొని వెల్తారు. హైదరాబాద్, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల వారు ఆర్డర్‌పై ప్రత్యేకంగా మక్క వడలు వేయించుకొని పార్సిల్లను తమతో తీసుకొని వెల్తుంటారు.

దేశీ కోడి కూరలో నంజుకుంటూ..
అంకాపూర్‌ మక్కవడల రుచి తెలిసిన భోజన ప్రియులు ఇక్కడ ప్రత్యేకంగా లభించే దేశీ కోడిని ఆర్డర్‌ చెప్పుకొని మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్‌ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరలో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో దేశీ కోడి వండి ఇచ్చే ఆర్డర్‌ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సీజన్‌లో దొరికే ఈ మక్కవడలకు అంకాపూర్‌లో ఎక్కడాలేని డిమాండ్‌ ఉంది.

సీజనల్‌గా మంచి గిరాకీ..
మక్కల సీజన్‌లోనే మక్క వడలను వేస్తుంటాము కాబట్టి సీజనల్‌గా మా హోటళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మక్క వడలు వేస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వారు తాము తినడంతో పాటు తమ ఇంటివాళ్లకోసం కూడా తీసుకెళ్తున్నారు.
– సిద్ధు, మక్క గారెలు వేస్తున్న హోటల్‌ యజమాని, అంకాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top