ఆయాలే టీచర్లు.. | Anganwadi Posts Notification Pending In Telangana | Sakshi
Sakshi News home page

ఆయాలే టీచర్లు..

Feb 11 2019 12:03 PM | Updated on Feb 11 2019 12:03 PM

Anganwadi Posts Notification Pending In Telangana - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల బలోపేతానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సమస్య ఉన్నది ఇక్కడే. జిల్లాలో చాలా అంగన్‌వాడీల్లో టీచర్లు లేక ఆయాలే టీచర్లుగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసే అంశం. పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. చిన్నారులకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చినా వారికి పాటలు, అక్షరాలు రావడం లేదు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ గురించి చెప్పేవారు కరువయ్యారు. బాలింతలు, గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలకు కేవలం పప్పు, కోడి గుడ్లు తీసుకునేందుకే వస్తున్నారు. ఆయాలు లేని దగ్గర చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు సమయానికి పౌష్టికాహారాన్ని అందించడం లేదు. టీచర్లు లేకపోవడంతో చిన్నారులను అంగన్‌వాడీ స్కూల్‌కు పంపేందుకు వెనుకడగు వేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు తీసుకొని తొమ్మిదినెలలవుతున్నాఇంతవరకూ నియమించకపోవడం శోచనీయం.

జిల్లాలో 908 అంగన్‌వాడీ కేంద్రాలు.. 
అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించి తొమ్మిది నెలలవుతున్నా ఎంపికలు ఇంకా పూర్తి కావడం లేదు. జిల్లాలో 908 అంగన్‌ వాడీ కేంద్రాలు ఉన్నాయి. . వాటిలో అంగన్‌ వాడీ టీచర్‌లు 28, ఆయాలు 79,  మినీ అంగన్‌ వాడీ టీచర్‌లు 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 10వ తేధీ వరకు ఖాళీగా> ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరించారు. దరఖాస్తులు స్వీకరించి తొమ్మిది నెలలవుతున్నా ఎంపికలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో అంగన్‌వాడీ టీచర్, ఆయాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు జిల్లా కలెక్టర్‌కు ఎంపికలు త్వరగా చేయాలని వినతి పత్రాలను అందిస్తూనే ఉన్నారు.

1967 దరఖాస్తులు
పదో తరగతి అర్హతగా ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అంగన్‌ వాడీ టీచర్‌కు నెలకు రూ.10,500, ఆయాలకు రూ.6,500 లుగా వేతనాలు ఉండడంతో దరఖాస్తుదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.   జిల్లాలో 130 పోస్టులకుగాను మొత్తం 1967 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నర్సంపేట ప్రాజెక్ట్‌లో 10 టీచర్‌ పోస్టులకు 323 దరఖాస్తులు, 29 ఆయా పోస్టులకు 326 దరఖాస్తులు, 6 మినీ అంగన్‌వాడీ టీచర్లకు 94 దరఖాస్తులు వచ్చాయి. పరకాల ప్రాజెక్ట్‌ పరిధిలో మూడు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు గాను  290 మంది, 10 ఆయా పోస్టులకు 149 మంది, వర్ధన్నపేట ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్‌ పోస్టులకు 383, 40 ఆయా పోస్టులకు  236, మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 196 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

కొనసాగుతున్న పరిశీలన
ఆన్‌లైన్‌ ద్వారా  చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన సీడీపీఓల పరిధిలో ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం ఫిజికల్‌గా వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. సీడీపీఓలు చేసిన ప్రతి పరిశీలనను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆయా పోస్టులకు ఎంతమంది అర్హులు తేల్చనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్‌ అందించనున్నారు.

ఎన్నికల కోడ్‌లతో ఆలస్యం
వరుసగా ఎన్నికల కోడ్‌ల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. అంగన్‌వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం.  కలెక్టర్‌ నేతృత్వంలో త్రీమన్‌ కమిటీ వేశారు. వారు పూర్తిగా అభ్యర్థుల అర్హతలను పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో జాబితాను ప్రకటిస్తాం. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement