రండి.. రండి.. దయచేయండి! 

All India Industrial Exhibition on Jan 1st - Sakshi

నుమాయిష్‌కు సర్వం సిద్ధం 

1న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం  

మెట్రోతో పెరగనున్న సందర్శకులు  

హైదరాబాద్‌: 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–2019 (నుమాయిష్‌)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1న ఈ నుమాయిష్‌ ప్రారంభం అవుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షత వహించే నుమాయిష్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15తో ప్రదర్శన ముగుస్తుంది. నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ సొసైటీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వివరాలను శనివారం ఈటల ఎగ్జిబిషన్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యులతో కలసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీని స్థాపించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉత్పత్తి అయ్యే కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించేందుకు వీలు కల్పించారు. ఈ ఏడాది 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రైవేట్‌ సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాళ్లను కేటాయించారు. ఈ సంస్థలు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాయి.  

మెట్రో రైలు కళ...  
ఈ ఏడాది నుమాయిష్‌కు మెట్రో రైలు కళ సంతరించుకోనుంది. మియాపూర్‌ నుంచి నాంపల్లి, ఎల్బీ నగర్‌ నుంచి నాంపల్లికి మెట్రో రైలు సౌకర్యం ఉంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సర్వీసులను అదనంగా నడిపేందుకు అధికారులు అంగీకరించారు. మెట్రో టికెట్లు కొనేందుకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోని మూడు గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఉచిత పార్కింగ్‌... 
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నుమాయిష్‌కు ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నుమాయిష్‌ చుట్టుప్రక్కల ఉండే ప్రభుత్వ శాఖల భవన సముదాయాల్లో పార్కింగ్‌ ఉచితంగా చేసుకోవచ్చు. గగన్‌ విహార్, చంద్రవిహార్, భీంరావ్‌ బాడా, గృహకల్ప, మనోరంజన్‌ కాంప్లెక్స్, అబ్కారీ భవన్‌ ఎదుట ఉచిత పార్కింగ్‌ స్థలాలుగా ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. వీటితో పాటుగా తాజ్‌ ఐల్యాండ్‌ నుంచి చంద్రవిహార్‌ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో సందర్శకుల నుంచి కాంట్రాక్టర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి దోచుకునేవారు. 

లాభాపేక్షలేని సంస్థ ఇదిః ఈటల రాజేందర్‌ 
పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్‌ సొసైటీని ప్రారంభించారని ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహణతో వచ్చే ఆదాయాన్ని 18 విద్యా సంస్థలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత 78 సంవత్సరాలుగా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. కేసీఆర్‌ చొరవతో ఎగ్జిబిషన్‌ను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సరికొత్త సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు.

కొనసాగనున్న రోజులు: 45 
ప్రవేశ రుసుం: రూ.30 
ఏర్పాటు చేసే మొత్తం స్టాల్స్‌: 2,500 
మెట్రో రైలు సర్వీసులు: రాత్రి 11.30 వరకు 
పాల్గొననున్న వలంటీర్లు: 1,500 మంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top