జిల్లా ప్రజానీకం కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ.. ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై ఏమాత్రం కనిపించడం లేదు.
నల్లగొండ : జిల్లా ప్రజానీకం కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ.. ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై ఏమాత్రం కనిపించడం లేదు. గ్రామాల్లో ఎక్కడిపడితే అక్కడ బెల్టుదుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో కరువుతీరా మద్యం లభిస్తోంది. గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు దొరకకున్నా మద్యానికి కొదవలేదు. రెండు, మూడు బెల్టుదుకాణాలు ఉన్న గ్రామాల్లో ప్రస్తుతం 20 నుంచి 30 షాపులు కొత్తగా పుట్టుకొచ్చాయి. నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన 2015 అక్టోబర్ 1 నుంచి 2016 మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా రూ.802 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. అంతకుముందు 2014 అక్టోబర్ నుంచి 2015 మార్చి వరకు కేవలం రూ.504 కోట్లు మద్యం అమ్మకాలు మాత్రమే జరి గాయి. 2014తో పోలిస్తే ఈ ఆరు మాసాల్లోనే మద్యం సేల్స్ రూ.298 కోట్లకు పెరగడం విశేషం.
సర్కిళ్ల వారీగా ఆదాయం..
పట్టణం, పల్లె వ్యత్యాసం లేకుండా మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలుతున్నా రు. ఓ మోస్తారు మ ద్యం అమ్మకాలు జరిగే నాం పల్లి, చండూరు, ఆలే రు ఎస్హెచ్ఓ పరిధిలో కూ డా మద్యం అమ్మకా లు గరిష్టస్థాయికి చేరా యి. మద్యం అమ్మకాలు అత్యధికంగా జరిగిన సర్కిళ్లలో నల్లగొండ మొదటి స్థానం లో ఉంది. ఈ సర్కిల్ పరిధిలో ఆరు మాసాల కాలంలో రూ.119 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రెండో స్థానం సూర్యాపేట సర్కిల్ పరిధిలో రూ.82.51 కోట్లు, మూడో స్థానంలో భువనగిరి సర్కిల్ రూ.77.40 కోట్లు, నాలుగో స్థానం మిర్యాలగూడ సర్కిల్ పరిధిలోని దుకాణాల్లో రూ.75.01 కోట్ల మద్యం విక్రయూలు జరిగాయి. గతంలో ఈ సర్కిళ్ల పరిధిలో అమ్మకాలు రూ.48 కోట్ల నుంచి రూ.82 కోట్లకు మించలేదు. మారుమూల ప్రాంతాలైన నాంపల్లి సర్కిల్ పరిధిలో రూ.9.68 కోట్ల నుంచి రూ.19.47 కోట్లకు మద్యం అమ్మకాలు పెరిగాయి. హాలియా సర్కిల్లో రూ.26.16 కోట్ల నుంచి రూ.47.70 కోట్లకు, చండూరు సర్కిల్లో రూ.17.37 కోట్ల నుంచి రూ.27.40 కోట్ల కు, ఆలేరు సర్కిల్ పరిధిలో రూ.23.36 కోట్ల నుంచి రూ.38.07 కోట్లకు పెరగడం విశేషం.
బీర్లకు ఎక్కువ గిరాకీ
మద్యం అమ్మకాల్లో లిక్కర్‌తో పోలిస్తే బీర్లకు గిరాకీ అధికంగానే ఉంది. అదీగాక ప్రస్తుతం వేసవి పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో మందుబాబులు బీర్లపైనే మక్కువ చూ పిస్తున్నారు. 2015 అక్టోబర్ నుంచి 2016 మార్చి నెలాఖరు వరకు జరిగిన అమ్మకాల్లో బీర్లు 20,99,735 పెట్టెలు అమ్ముడుగాకా...లిక్కర్ 15,53,983 పెట్టెలు అమ్ముడయ్యాయి. 2014 అక్టోబర్ నుంచి 2015 మార్చి వరకు జరిగిన అమ్మకాల్లో బీర్లు 16,03,378 పెట్టెలు అమ్ముడైతే.. లిక్కర్ కేవలం 8,64,763 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2014తో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన బీర్ల పెట్టెలు 4,96,357 కాగా లిక్కర్ 6,89,220 పెట్టెలకు పెరిగి రికార్డు సృష్టించింది. మద్యం ప్రియులు మీడియం రకానికి చెందిన లిక్కర్‌నే ఎక్కువగా సేవిస్తున్నారు. ఆర్డనరీ రకానికి చెందిన బ్రాండ్లు 1,94, 807 పెట్టెలు అమ్ముడుకాగా.. మీడియం 8,5 7, 244 పెట్టెలు, ప్రీమియం 5,01,932 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఇది లావుంటే వేసవి ఎండలు మరింత ముదురుతున్నా కొద్దీ బీర్లు అమ్మకాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బీర్లకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.